బడి గంట మోగాక... బదిలీ తంటా !

Teacher Transfer Work Begins After Schools Open In Telangana - Sakshi

వేసవి సెలవుల్లో బదిలీల ఊసే లేదు.. తీరా స్కూళ్లు తెరిచాక నానా హడావుడి 

బదిలీలు, జాయినింగ్‌లు, సెలవులతో జూలై మూడో వారం దాకా క్లాసులు అనుమానమే 

తర్వాత ఆగస్టు 15.. వారంపాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు 

ఆలోగా ఫస్ట్‌ టర్మ్‌ పరీక్షలు పూర్తి.. ‘త్రైమాసిక’కు సిలబస్‌ పూర్తెట్టా? 

సాక్షి, హైదరాబాద్ ‌:  గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు బడుల్లో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల అర్థం లేని చర్యల కారణంగా స్కూలు పిల్లలు దాదాపు రెండున్నర నెలల పాటు విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి సెలవుల్లో బదిలీల ఊసెత్తని అధికార యంత్రాంగం తీరా బడులు తెరిచాక ఆ ప్రక్రియకు తెరదీయడంతో కనీసం 75 రోజులు వృథా కానున్నాయి. ఎంతో అనుభవం ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖను నిర్వహిస్తున్నా ఉన్నతాధికారుల నిర్ణయానికి తలూపడం, బదిలీల ప్రక్రియలో అధికారులు ఎడతెగని జాప్యం చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈసారి త్రైమాసిక పరీక్షల నాటికి సిలబస్‌ ఎట్టి పరిస్థితుల్లో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. టీచర్లు కూడా బదిలీల ప్రహసనంలో పూర్తిగా మునిగిపోయారు. పాఠాలను పక్కనపెట్టి తమకు ఎక్కడకు బదిలీ అవుతుందోనన్న ఉత్కంఠతో పాఠశాలల్లో గడుపుతున్నారు. 

పంద్రాగస్టు దాకా అంతంతే..! 
ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత జూన్‌ 2న పాఠశాలలు ప్రారంభించే వరకు 45 రోజులపాటు బదిలీల ఊసే కనిపించలేదు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయిన తర్వాత కూడా 20 రోజుల పాటు నిబంధనలు, మార్గదర్శకాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ అంటూ కాలం గడిపారు. ఆ తర్వాత వెబ్‌ కౌన్సెలింగ్, సాంకేతిక సమస్యలంటూ సాగదీశారు. చివరకు జూలై వచ్చినా బదిలీల ప్రక్రియకు ముగింపు పలకకపోవడం గమనార్హం. ఇప్పటికి కూడా బదిలీల పోస్టింగ్‌లు ఎప్పటికి ఇస్తారో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇప్పటికిప్పుడే ఇచ్చినా బదిలీ అయిన కొత్త పోస్టులో చేరేందుకు టీచర్లకు వారం రోజుల గడువుంటుంది. కొత్త పోస్టులో చేరిన తర్వాత కూడా సెలవులు పెట్టడం ఉపాధ్యాయులకు సర్వ సాధారణమే. ఇదంతా జరిగే సరికి జూలై మూడో వారం అవుతుంది. అప్పటికిగానీ ఉపాధ్యాయులంతా తమ పోస్టింగుల్లో కుదురుకునే అవకాశం లేదు. అప్పుడు పిల్లలకు కొత్త బడిలో పరిచయమై సీరియస్‌గా పాఠాలు ప్రారంభించేందుకు కనీసం మరో వారం పడుతుంది. 

అంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు మొదటి వారం నుంచి మాత్రమే సీరియస్‌గా పాఠాలు చెప్పడం ప్రారంభం అవుతుందన్న మాట! అప్పుడు కూడా మళ్లీ ఇంకో అడ్డంకి ఎదురుకానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆగస్టు 10 నుంచే పాఠాలు బంద్‌ చేసి స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో మునిగిపోవాల్సి ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే ఆగస్టు 16 నాటికి గానీ సిలబస్‌ ప్రకారం పాఠాల బోధన ప్రారంభమయ్యే అవకాశాల్లేవు. అంటే... దాదాపు 75 రోజులు.. రెండున్నర నెలలు విద్యార్థులు నష్టపోతారన్నమాట. అప్పటిదాకా కొత్త టీచరు వచ్చి ఏం చెపుతాడో అనే భావనతో మొక్కుబడిగా బోధన సాగనుంది. ఈ లోగా పాఠశాలల్లో ఫస్ట్‌ టర్మ్‌ పరీక్షలు కూడా అయిపోతాయి. త్రైమాసిక పరీక్షల సిలబస్‌ పూర్తి కాదు. సెప్టెంబర్, అక్టోబర్‌లో త్రైమాసిక పరీక్షల కోసం హడావుడిగా పాఠాలు బోధించాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనుంది.  

ఎక్కడికెళ్లినా బదిలీల చర్చే 
బదిలీల ప్రక్రియ ఓవైపు నడుస్తున్నా... మరోవైపు పాఠాల బోధన సీరియస్‌గానే జరుగుతోందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పాఠాల బోధన కన్నా బదిలీల చర్చే ఎక్కువగా జరుగుతోంది. బదిలీలంటనే సహజంగా ఉండే ఆసక్తికితోడు ఆ ప్రకియలో జరుగుతున్న ప్రహసనం ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుండడంతో వారి దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమైంది. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా ఈ అంశంపైనా మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు. బదిలీ ఆప్షన్‌ ఎక్కడెక్కడికి పెట్టారు.. ఎక్కడ వచ్చే అవకాశం ఉంది.. ఆ పాఠశాలకు రోడ్డు సౌకర్యాలున్నాయా.. బస్సు వెళ్తుందా.. సొంత వాహనం తీసుకెళ్లాల్సి ఉంటుందా.. వెబ్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్లలోని సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? అనే అంశాలపైనే ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల కార్యాలయాల్లోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలివ్వడం, వారికి అవసరమైన సహకారం అందించడంలో ఉపాధ్యాయ నేతలు మునిగిపోయారు. 

వాట్సాప్‌లో చర్చోపచర్చలు
బదిలీల ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి వాట్సాప్‌ గ్రూపుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బదిలీల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు, షెడ్యూల్, వెబ్‌ కౌన్సెలింగ్‌ సలహాలపైనే వాట్సాప్‌ గ్రూపుల్లో ఉపాధ్యాయులు పోస్టింగుల మీద పోస్టింగులు పెడుతున్నారు. బదిలీల ప్రక్రియ జరుగుతున్న తీరు, నిబంధనలపై వ్యంగ్య చిత్రాలు రూపొందించడంలో కొందరు టీచర్లు క్రియేటివిటీ చూపిస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అవరోధం కలిగిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top