పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన వివాహిత స్రవంతి(26) శనివారం అనుమానాస్పదస్థితిలో మరణించింది.
భర్తే చంపాడు: మృతురాలి బంధువులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన వివాహిత స్రవంతి(26) శనివారం అనుమానాస్పదస్థితిలో మరణించింది. అయితే భర్తే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు బంధువుల కథనం ప్రకారం.. కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేటకు చెందిన స్రవంతి వివాహం పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన శ్రీనివాస్‌తో నాలుగేళ్ల క్రితం జరిగింది. వివాహ సమయంలో రూ.6 లక్షల కట్నం ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల శ్రీనివాస్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి.
ఈవిషయమై భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో గురువారం స్రవంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పెద్దపల్లికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై కిశోర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
అత్తింటివారే చంపారు: మృతురాలి తల్లిదండ్రులు
తమ కూతురు స్రవంతి ఆత్మహత్య చేసుకోలేదని, భర్త శ్రీనివాస్ చంపాడని మృతురాలి తల్లిదండ్రులు మధునయ్య, లక్ష్మి ఆరోపించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందనే శ్రీనివాస్ బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించాడని వారు అన్నారు. రూ.6 లక్షలు కట్నం ఇచ్చిన అదనపు కట్నం కోసం వేధించేవాడని ఈక్రమంలోనే మరో రూ.50 వేలు ముట్టజెప్పామని బోరుమన్నారు.