రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే మెదక్ జిల్లాలోనే అనేక మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని...
- ఎంపీ పొంగులేటికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ప్రభుగౌడ్ వినతి
సంగారెడ్డి క్రైం: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే మెదక్ జిల్లాలోనే అనేక మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి కేంద్రం దృష్టికి తేవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఎంపీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు భరోసా కల్పించకపోవడం వల్లనే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంలో ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులు ఎటువంటి కష్టాలు లేకుండా వ్యవసాయం చేశారన్నారు.
అనేక మంది రైతులకు రుణ విముక్తి కల్పించిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆనాడు వైఎస్ రైతులకు రుణ మాఫీ, ఉచిత కరెంట్, రుణాల రీ షెడ్యూల్ తదితర పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు. కాగా ప్రభుగౌడ్ చేస్తున్న సేవలను గుర్తించి పలువురు పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు.