ఏదీ నవలోకం?

Special Story On Hyderabad Development - Sakshi

నగరంపై కనిపించని ఆధునిక జాడలు  

డల్లాస్‌ బాటలో బహుళ వరుసల దారుల్లేవ్‌  

ఇస్తాంబుల్‌ వలే చారిత్రక కట్టడాలకు హంగులు కరువు

టోక్యో తరహాలో స్వచ్ఛ ప్రాణ వాయువు నిల్‌

సాక్షి,సిటీబ్యూరో: ట్రాఫిక్‌ అవస్థలు లేని తీరైన బహుళ వరుసల ఆకాశ దారులు డల్లాస్‌ (అమెరికా) నగరం సొంతం. చారిత్రక వారసత్వ కట్టడాలను సమున్నత రీతిలో ఆవిష్కరించిన మహానగరం ఇస్తాంబుల్‌(టర్కీ). పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా విశ్వకీర్తిని సొంతం చేసుకున్న సిటీ టోక్యో(జపాన్‌). స్వచ్ఛ ప్రాణవాయువును సిటీజన్లకు అందించేందుకు టోక్యో సర్కారు చేపట్టిన కృషి అనిర్వచనీయం. ఈ విశ్వ నగరాలకు మన గ్రేటర్‌ నగరంతో లింకు ఏమిటనుకుంటున్నారా..? 

కొత్త ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలతో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌ నగరంలా తీర్చిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో టీఆర్‌ఎస్‌ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. ఘనమైన చరిత్ర, వారసత్వ సంపదకు నిలయమైన పాతనగరాన్ని సైతం ఇస్తాంబుల్‌ సిటీలా తీర్చిదిద్దుతామని తెలిపింది. ఆ దిశగా పడిన తొలి అడుగు మాత్రం మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా ఊగిసలాడుతోంది. ఇక గ్రేటర్‌ మహానగరంలో స్వచ్ఛమైన ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను సిటీజన్లకు అందించేందుకు టోక్యో తరహాలో ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ’ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కాలేదు. మూడు విశ్వనగరాల బాటలో నాలుగున్నరేళ్లుగా మన గ్రేటర్‌ సిటీ సాగించిన పయనం ఆదిలోనే అగిపోయింది.

డల్లాస్‌లా బహుళ వరుసలదారులకు శ్రీకారం
స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఆర్‌ డీపీ)లో భాగంగా గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో స్కైవేలు, మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించేందుకు నాలుగు దశల్లో రూ.19,263 కోట్లతో పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. తొలి దశలో రూ.1096 కోట్ల వ్యయంతో ఐదు ప్యాకేజీల్లో 18 పనులకు టెండర్లు పిలిచారు. వీటిలో  ఒకటో ప్యాకేజీ (కేబీఆర్‌ పార్కు పరిసరాలు) పనులు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) స్టేతో నిలిచిపోయాయి. రెండో ప్యాకేజీ (ఎల్బీనగర్‌) పనుల్లో యుటిలిటీస్‌ తరలింపు, భూసేకరణతదితరాలు పూర్తిచేసి పనులకు శ్రీకారం చుట్టారు. చింతల్‌కుంట అండర్‌పాస్‌ పనులు పూర్తయ్యాయి. మూడో ప్యాకేజీ(ఉప్పల్, రసూల్‌పురా జంక్షన్లు) పనులను భూసేకరణ కష్టాలతో విరమించుకున్నారు. నాలుగో ప్యాకేజీ (బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్‌స్పేస్‌ జంక్షన్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌ గాంధీ జంక్షన్లు) పనులు మాత్రం జరుగుతున్నాయి. వీటిలో మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఐదోప్యాకేజీ (ఒవైసీ హాస్పిటల్, బహదూర్‌పురా జంక్షన్లు) స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో పనులకు బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది.

టోక్యో క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ హుళక్కే
గ్రేటర్‌లో గాలి, నీరు, నేల కాలుష్యానికి పాల్పడుతూ నగర పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోన్న అక్రమార్కులకు జపాన్‌ రాజధాని టోక్యో తరహాలో జైలుశిక్ష, భారీ జరిమానాలు విధించాలన్న పీసీబీ యంత్రాంగం ప్రయత్నం విఫలమైంది. టోక్యోలోని ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ’ తరహాలో గ్రేటర్‌ పరిధిలోనూ అథారిటీ ఏర్పాటుతో పాటు దీనికి విస్తృత అధికారాలతో చట్టం రూపొందించే అంశం కాగితాలకే పరిమితమైంది. విశ్వనగరంగా భాసిల్లుతోన్న టోక్యో నగరంతో పాటు ఆ నగరానికి సమీపంలోని 22 పట్టణాల్లో అక్కడి ప్రభుత్వం వాయు, జల, నేల కాలుష్యాన్ని కట్టడి చేసింది.

రవాణా, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండళ్ల భాగస్వామ్యంతో క్లీన్‌ ఎయిర్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, ఈవేస్ట్, జీవ వ్యర్థాలను ఆధునిక సాంకేతిక విధానాల ద్వారా శుద్ధిచేసి పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల డంపింగ్, తగలబెట్టడం వంటి చర్యలకు స్వస్తి చెప్పింది. ఆ నగరంలో నిరంతరం వాయు కాలుష్యాన్ని లెక్కించి అప్పటికప్పుడు దాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఉద్గారాలను అధిక మొత్తంలో వెదజల్లుతున్న పరిశ్రమలను బ్యాన్‌ చేసింది. కానీ మన గ్రేటర్‌లో మాత్రం కాలుష్యం కట్టడికి సర్కారు తీసుకున్న చర్యలు ఫలితం ఇవ్వకపోవడం గమనార్హం. 

ఇస్తాంబుల్‌కు దూరందూరం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగేళ్ల క్రితం ఇస్తాంబుల్‌ నగరం తరహాలో గ్రేటర్‌లోని పలు పర్యాటక, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా అభివద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ ఆ దిశగా పడిన అడుగులు శూన్యమే. ఎందుకంటే.. ఇస్తాంబుల్‌లో ప్రధానంగా రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు అక్కడి చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా ఆ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. ఇస్తాంబుల్‌ నగరంలో 17 రాజ సౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలు చారిత్రక వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. వీటి పరిరక్షణకు మాస్టర్‌ప్లాన్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. కానీ మన గ్రేటర్‌లో చారిత్రక గోల్కొండ కోట, చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మక్కామసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ, మోజంజాహీ మార్కెట్, హుస్సేన్‌ సాగర్‌ ఇలా 200కు పైగా చారిత్రక కట్టడాలకు నెలవు. అయితే, ఇటీవల రహదారుల విస్తరణ, మెట్రో ప్రాజెక్టు, మాస్టర్‌ప్లాన్‌ పనుల కారణంగా పలు చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పలు చారిత్రక కట్టడాల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top