సేఫ్టీ ఫస్ట్‌

Road Safety on Road Works in Hyderabad - Sakshi

రోడ్ల పనుల వ్యయంలో కొంత శాతం ‘రోడ్‌ సేఫ్టీ’ చర్యలకు

ఈ నిధులతో ఎప్పటికప్పుడు రహదారుల మరమ్మతులు

24 గంటల్లోగా గుంతల పూడ్చివేత

అమలు..పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం

నగరంలో అధ్వానపు రోడ్లతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రోడ్ల నిర్వహణ..భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు వివిధ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం రోడ్ల నిర్మాణ వ్యయంలో కొంత శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ నిధులతో సిటీలో ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు, ఇతర పనులు చేపడతారు. రాకపోకలు సాఫీగా, సౌకర్యవంతంగా జరిగేలా చూస్తారు.    

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రాబోయే రోజుల్లో గుంతల్లేని రోడ్లు దర్శనమివ్వనున్నాయా..? రోడ్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు సత్వరం చేపట్టనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. రోడ్‌ సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎందరో గాయాల పాలవుతుండటం.. మరణాలు చోటు చేసుకుంటుండటం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని కఠినమైన రోడ్‌ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని భావించింది. ఈ అంశంపై దాదాపు రెండు నెలల క్రితం వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఇందులో రోడ్‌సేఫ్టీ కోసం ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు రోడ్లు, ఫ్లై ఓవర్లు తదితర ఇంజినీరింగ్‌ పనులు చేసేప్పుడు వాటిల్లో కొంతశాతం నిధులు రోడ్‌సేఫ్టీ కోసం కేటాయించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ నిధులతో భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. అందుకుగాను రోడ్‌ సేఫ్టీ అమలుకు ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆమేరకు ముసాయిదా బిల్లు రూపొందించినట్లు తెలిసింది.

అవసరమైన పక్షంలో సదరు బిల్లుకు తగిన మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ఆమోదం అనంతరం అమల్లోకి తేనున్నారు. ఇంజినీరింగ్‌ పనుల్లో ఎంత శాతాన్ని రోడ్‌ సేఫ్టీ కోసం కేటాయించాలనేదానిపై తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు రెండు శాతం కేటాయించాలనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. జీహెచ్‌ఎంసీకి సంబంధించి అంతమొత్తం కేటాయించే పరిస్థితి లేదు. జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేవు. రహదారులు, ఫ్లై ఓవర్లు తదితరమైన వాటికి బాండ్ల ద్వారా సేకరించిన నిధులను వినియోగిస్తున్నారు. వాటికి వడ్డీ కట్టాల్సి వస్తోంది. అంతే కాకుండా గ్రేటర్‌లో చేపట్టాల్సిన పనులు దాదాపు 25 వేల కోట్ల మేర ఉండటంతో రెండు శాతం అంటే.. భారీ నిధులు కేటాయించాల్సి ఉన్నందున జీహెచ్‌ఎంసీకి సంబంధించి 0.25 శాతం లేదా 0.50 శాతం కేటాయించినా చాలుననే అభిప్రాయాలున్నాయి. ఎంత శాతమనేది ఖరారై, బిల్లు కార్యరూపం దాల్చాక సదరు నిధులతో  ఎప్పటికప్పుడు  రహదారుల మరమ్మతులు సత్వరం చేస్తారు.  రోడ్లపై పడే గుంతల్ని 24 గంటల్లోగా పూడ్చివేస్తారు. తద్వారా నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. 

తక్షణ మరమ్మతు బృందాలు మరిన్ని పెరగాలి..
విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా రోడ్ల మరమ్మతులు చేసేందుకు, పాట్‌హోల్స్‌ వెంటనే పూడ్చివేసేందుకు 79 తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్‌టీ) ఉన్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలపగా, వాటిని ఇంకా పెంచాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ఏడాది పొడవునా నగరంలోని అన్ని రోడ్లు ఎలాంటి పాట్‌హోల్స్‌ లేకుండా ఉండాలని, దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని సూచించారు. ఇందుకుగాను తగినన్ని  ప్రీమిక్స్‌ బీటీ బ్యాగుల్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. రోడ్‌ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకంగా రోడ్‌ సేఫ్టీ కమిషనరేట్‌ ఏర్పాటు అవసరం కూడా అధికారుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top