హైటెక్‌ హైవే!

Regional Ring Road in Telangana - Sakshi

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్‌ఆర్‌ఆర్‌ రూపకల్పన 

అధునాతన సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యం 

మలేసియాలోని ఎక్స్‌ప్రెస్‌ హైవేల అధ్యయనం  

త్వరలోనే వెళ్లనున్న ఆరుగురు ఇంజనీర్ల బృందం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన దరమిలా పనులు ముమ్మరం చేసింది. ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నిర్మించనున్న ఈ రోడ్డును ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. దీనికోసం ప్రస్తుతం మలేసియాలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ హైవేలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆరుగురు ఇంజనీర్ల బృందం త్వరలోనే మలేసియాకు వెళ్లి అక్కడి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, దీనిపై అందిస్తున్న వివిధ రకాల సౌకర్యాలు, సేవలు తదితర విషయాలపై అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం ఈ రోడ్‌ డీపీఆర్‌ రూపొందించడంలో సాయపడుతున్న మలేసియాకు చెందిన కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (సీఐడీబీ) ప్రతినిధులు ఇప్పటికే మంత్రిని కలిసిన విషయం తెలిసిందే.

మలేసియానే ఎందుకు... 
మూడు దశాబ్దాల(1980) కిందే మలేసియా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి పూనుకుంది. అందుకే మలేసియా హైవే అథారిటీ (ఎంహెచ్‌ఏ)ని స్థాపించి ప్రపంచ స్థాయి అత్యున్నత ఎక్స్‌ప్రెస్‌ హైవేలను నిర్మించింది. మలేసియాలో 1,821 కి.మీ.లకుపైగా విస్తరించి ఉన్నాయి. ఇవి వివిధ కీలక నగరాల కనెక్టివిటీకి, ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయి. పొరుగున ఉన్న సింగపూర్‌తోనూ రోడ్డు రవాణాను అభివృద్ధి చేసుకోగలిగింది. ఆగ్నేయాసియా దేశాల్లో మలేసియా ఎక్స్‌ప్రెస్‌ హైవేలు అత్యున్నతమైనవి అనడంలో సందేహం లేదు. 

సదుపాయాలు ఇలా.. 
- ఎక్స్‌ప్రెస్‌ హైవేలు అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తారు. వీటిపై రవాణా పూర్తిగా నియంత్రణలో ఉంటుంది.  
- ఈ హైవేపై పక్కన ఏర్పాటు చేసే కంచె కారణంగా జంతువులు ప్రవేశించలేవు.  
- ప్రతీ టోల్‌ గేట్‌ వద్ద ఆగి డబ్బులు చెల్లించే ఇబ్బంది లేకుండా.. టచ్‌ అండ్‌ గో కార్డులు (క్రెడిట్‌ కార్డు తరహాలో) అందుబాటులో ఉంటాయి.  
- రోడ్డుపై నిత్యం పోలీసింగ్‌ ఉంటుంది. ట్రాఫిక్‌ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. 
- వాహన వేగాన్ని లెక్కిండానికి స్పీడ్‌ గన్‌ కెమెరాలు ఉంటాయి.  
- సైన్‌బోర్డులు, వార్నింగ్‌ బోర్డులు, సులువుగా అర్థమయ్యేలా ఏర్పాటు చేస్తారు. 
- డ్రైవర్లు రెస్ట్‌ తీసుకోవడానికి సదుపాయాలు ఉంటాయి.  
- ఫుడ్‌ కోర్డులు, రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకులు, ఏటీఎం కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. 
- రోడ్డుపై వాహనాలు నిలిచిపోతే వాటిని పక్కన నిలపడానికి ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top