సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఈనెల 13న రెండు చోట్ల రీపోలింగ్ జరగనుంది. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి అనివార్యమైంది.
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఈనెల 13న రెండు చోట్ల రీపోలింగ్ జరగనుంది. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి అనివార్యమైంది. కొత్తగూడెం నియోజకవర్గం పాత కొత్తగూడెంలోని 161 పోలింగ్ కేంద్రంలో, భద్రాచలం నియోజకవర్గం వీఆర్‌పురం మండలం జల్లివారిగూడెంలోని 239 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్‌కు శనివారం రాత్రి ఆదేశాలు అందాయి. గత నెల 30న పోలింగ్ సందర్భంగా ఈరెండు చోట్ల ఈవీఎంలలో సమస్య తలెత్తిందని గుర్తించిన ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఉండేందు కు రీపోలింగ్ నిర్ణయించాలని భావించింది.
అయితే ఈ రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థుల ఈవీఎంలలోనే సమస్య ఏర్పడినందున.. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటింగ్ కోసమే పోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడి ఓటర్లు కేవలం ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి. ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసేది ఉండదు. పాత కొత్తగూడెంలోని పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, జల్లివారిగూడెం పోలింగ్ కేంద్రంలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.