రేషన్‌ బియ్యానికి రెక్కలొస్తున్నాయ్‌..!

Ration Rice Smuggling In Khammam - Sakshi

ఇల్లెందు(ఖమ్మం): ఇల్లెందు ఏరియాలో రేషన్‌ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. రేషన్‌ వినియోగదారుల ఇళ్లలో ని ఈ బియ్యం.. గ్రామం దాటి, మహబూబాద్‌ వెళుతోంది. ఆ తరువాత కాకినాడకు చేరుతోంది. అక్కడి నుంచి సముద్రం దాటి విదేశాలకు వెళుతోంది.

మాణిక్యారంలో పట్టివేత 
ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామం నుంచి 20టన్నుల రేషన్‌ బియ్యాన్ని లారీలో ఇద్దరు వ్యక్తులు (రామారావు, నర్సయ్య) తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇల్లెందు పట్టణంలోని చెరువు కట్ట ప్రాంతంలో మాటు వేశారు. రాత్రివేళ అటుగా వచ్చిన ఆ లారీని అడ్డుకున్నారు. విజయవాడకు చెందిన ఏపీ16టీవై 4389 నంబర్‌ లారీలో మాణిక్యారం గ్రామానికి ఎరువుల బస్తాలు వచ్చాయి. అదే లారీలో బియ్యం తరలిస్తున్నారు. అందులోని 20టన్నుల బియ్యాన్ని స్వా ధీనపర్చుకున్నారు. లారీడ్రైవర్‌ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు.

అధికారుల అండదండలు...! 
ఇల్లెందు ఏరియా నుంచి అర్ధరాత్రి అక్రమంగా రేషన్‌ బియ్యం తరలుతోంది. ఈ దందా వెనుక సంబంధిత అధికారుల హస్తం కూడా ఉందని, దీనికి ప్రతిగా వారికి దండిగానే డబ్బు ముడుతోందని సమాచారం. నెల రోజుల్లో నాలుగు లారీల్లో రేషన్‌ బియ్యం తరలించారు. ఇల్లెందు, గార్ల, సత్యనారాయణపురం, మాణిక్యారం  కేంద్రాలుగా ఈ దందా సాగుతోంది. ఐదారుగురు సభ్యులున్న నాలుగు ముఠాలు ఇలా బియ్యం తరలిస్తున్నాయి. ప్రతి నెల 1వ నుంచి 20వ తేదీ వరకు ఈ ముఠాలు గ్రామాల్లో కేజీ రేషన్‌ బియ్యాన్ని నాలుగు నుంచి ఆరు రూపాయల చొప్పున కొని ఒకచోట నిల్వ చేస్తున్నాయి. డోర్నకల్,మహబూబాబాద్‌లోని రైస్‌ మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసి 25 కిలోల సంచుల్లో ప్యాకింగ్‌ చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు.

తాజాగా, మాణిక్యారం గ్రామం వద్ద 20 టన్నుల బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. 15 రోజుల ముందు కూడా ఇదే గ్రామం నుంచి మూడు లారీల బియ్యాన్ని మహబూబాబాద్‌కు తరలించారు. సత్యనారాయణపురం గ్రామం నుంచి ట్రాక్టర్ల ద్వారా నిజాంపేట అటవీ ప్రాంతంలోని రహస్య ప్రదేశంలోకి చేర్చారు. అక్కడి నుంచి వాహనంలో మహబూబాబాద్‌కు తరలించారు. గార్ల మండలానికి చెందిన ఒక ముఠా, మాణిక్యారం గ్రామానికి చెందిన ఇంకొక ముఠా, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మూడు ముఠాలు ఇలా బియ్యం తరలిస్తున్నాయి.

వీరు స్థానికంగా కిలో నాలుగు నుంచి ఆరు రూపాయలకు కొని, మహబూబాబాద్‌లోని మిల్లర్లకు పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ మిల్లర్లు రీసైక్లింగ్‌ చేసి కిలో 20 రూపాయల చొప్పున కాకినాడలో విక్రయిస్తున్నారు. ప్రతి నెల 1 నుంచి 20వ తేదీ వరకు ఈ దందా సాగుతోంది. ఇన్ని ముఠాలు ఇంత యథేచ్ఛగా, దర్జాగా బియ్యం సేకరిస్తుంటే.. తరలిస్తుంటే సివిల్‌ సప్లై శాఖకు తెలియడం లేదా...? తెలిసినా పట్టించుకోవడం లేదా..? కావాలనే పట్టుకోవడం లేదా...? ఈ అక్రమ దందాకు వారి సహకారం కూడా ఉందా...? ఇన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్యాసింజర్‌ రైలులో పట్టివేత 
మధిర: ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ప్యాసింజర్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని సివిల్‌ సప్లై అధికారులు మంగళవారం మధిరలో పట్టుకున్నారు. నాగులవంచ రైల్వేస్టేషన్‌లో ముగ్గురు మహిళలు రేషన్‌ బియ్యాన్ని ప్యాసింజర్‌ రైల్లో మొత్తం 16 బియ్యం మూటలను ఎక్కించారు. దీనిని  సివిల్‌ సప్‌లై జిల్లా పర్యవేక్షక కమిటీ సభ్యుడు వేమిరెడ్డి రోసిరెడ్డి గమనించారు వివరాలు అడుగుతుండగానే ఆ ముగ్గురు మహిళలు పరారయ్యారు.

ఆ మూటలను మధిర రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులకు, పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని సివిల్‌ సప్‌లైస్‌ జిల్లా అధికారి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆ బియ్యాన్ని రైల్వే పోలీసుల నుంచి సివిల్‌ సప్‌లై అధికారులు స్వాధీనపర్చుకున్నారు. కార్యక్రమంలో మధిర రైల్వే స్టేషన్‌  మాస్టర్‌ ఆర్‌వి.కాశిరెడ్డి, జీఆర్‌పీ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు, ప్లాట్‌ఫాం టీసీ ఎస్‌ఎస్‌ కిషోర్‌బాబు, పాయింట్స్‌మెన్‌ రమణ, తూములూరి మనోజ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top