
ఇక ఏటా ఆస్తి పన్ను మోత!
రాష్ట్రంలో ఇకపై ఏటా నిర్ణీత మొత్తంలో ఆస్తి పన్నులను పెంచేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది.
ఐదేళ్లకోసారి పెంచితే ప్రజలపై ఒక్కసారిగా భారం
ఏటా కనీసం 5 శాతంపెంచే యోచనలో ప్రభుత్వం
ప్రస్తుత పద్ధతిలోని పెంపు ప్రతిపాదనలను తిప్పి పంపిన మంత్రి కేటీఆర్..
ఏటా కొంత పెంపు కోసం త్వరలో కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఏటా నిర్ణీత మొత్తంలో ఆస్తి పన్నులను పెంచేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఐదేళ్లకోసారి ఆస్తి పన్నులు పెంచుతుండడంతో ప్రజలపై ఒక్కసారిగా భారం పడుతోందని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆస్తి పన్నులను ఏటా కనీసం 5 శాతం పెంచాలని.. ఇందుకోసం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ప్రస్తుత విధానంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్నుల సవరణ చేపట్టేందుకు పురపాలక శాఖ ఇటీవల సమర్పించిన ప్రతిపాదనలను ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు తిప్పిపంపడానికి ఇదే కారణమని తెలిసింది. ప్రజలపై ఒక్కసారిగా భారం పడకుండా ఏటా నిర్ణీత మొత్తంలో ఆస్తి పన్నులు పెంచేందుకు కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించినట్లు సమాచారం.
చట్టాలకు సవరణలు..
వార్షిక అద్దె విలువ ఆధారంగా ఐదేళ్లకోసారి ఆస్తి పన్నులను సవరిస్తుండడంతో ప్రజలపై ఒక్కసారిగా భారం పడుతోంది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో గత ప్రభుత్వాలు గడువు సమయాల్లో ఆస్తి పన్నుల సవరణ చేపట్టలేదు. దాంతో రాష్ట్రంలో 2007 నుంచి నివాస భవనాలపై, 2012 నుంచి నివాసేతర భవనాలపై ఆస్తి పన్నుల సవరణ జరగలేదు.
అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతేడాది 23 కొత్త నగర పంచాయతీలు, 3 కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణకు అనుమతించింది. దీంతో 30 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులు పెరగడంతో పలు చోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్లకోసారి కాకుండా.. ఏటా కొంత శాతం లెక్కన ఆస్తి పన్నులు పెంచాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు పురపాలక చట్టాలకు సవరణలు చేయనుంది.
వచ్చే ఏప్రిల్ 1 నుంచి పెంపు!
రాష్ట్రంలో నివాస గృహాలపై 2002 ఏప్రిల్ 1న, నివాసేతర భవనాలపై 2007 అక్టోబర్ 1న చివరిసారిగా ఆస్తి పన్నుల సవరణ జరిపారు. తదుపరి సవరణ నివాస భవనాలపై 2007లో, నివాసేతర భవనాలపై 2012లో జరపాల్సి ఉండగా.. అప్పటి ప్రభుత్వాలు అనుమతివ్వలేదు. కొత్త నగర పంచాయతీల్లో గతేడాది ఆస్తి పన్నులను పెంచారు. ఇక జీహెచ్‌ఎంసీ సహా 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోనూ పెంచాలన్న ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా తర్జనభర్జన పడుతోంది. ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలు 2015 జనవరిలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినా ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి.
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఆస్తి పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. ఏళ్ల తరబడిగా ఆస్తి పన్నులు పెంచకపోవడంతో మున్సిపాలిటీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే గ్రాంట్లు సైతం సకాలంలో అందడం లేదు. పట్టణీకరణకు తగ్గట్లు మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు ఉండడం లేదు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు సైతం సక్రమంగా వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి.
ఆస్తి పన్నుల వసూళ్లలో లోపాలను అధిగమించి ఆదాయాన్ని పెంచుకోవాలని, ప్రతి పురపాలిక స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి కేటీఆర్ ప్రతి సమావేశంలో అధికారులను ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ 1 నుంచే కొత్త విధానంలో ఆస్తి పన్నుల సవరణను అమలు చేయాలని పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ప్రస్తుత విధానంలోనే సవరణ చేసినా అమల్లోకి తెచ్చేందుకు కనీసం 9 నెలల సమయం పట్టనుంది.