∙రేపటి నుంచి పోలింగ్‌ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలి 

polling stations from tomorrow Take into account - Sakshi

విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

పోల్‌స్టార్‌ యాప్‌ ద్వారా నేరుగా కేంద్రాల పరిశీలన  

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఈనెల నాలుగు నుంచి పోలింగ్‌ కేంద్రాలను బూత్‌లెవల్‌ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎన్నికల అధికారి ఈ.శ్రీధర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే సెక్టోరల్‌ అధికారులు, బూత్‌ లెవల్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బందికి నాగర్‌కర్నూల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎన్నికల అధికారి ఈ.శ్రీధర్‌ మాట్లాడుతూ ఈసారి గతం కన్నా భిన్నంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం నుంచే పోల్‌స్టార్‌ యాప్‌ ద్వారా సెక్టోరల్‌ అధికారులతో నేరుగా తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలిస్తుందని అన్నారు.

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఓటర్లకు ఓటర్‌ స్లిప్‌ల పంపిణీకి సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం నుంచి సేకరిస్తారని, సెక్టోరియల్‌ అధికారులు అందుకు సంబంధించిన పోల్‌స్టార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

ఓటర్‌ స్లిప్‌లు ఓటర్లకు ఇంకా పంపిణీ పూర్తి చేయని పంచాయతీ సెక్రెటరీలపై సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం సాయంత్రానికి ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. బూత్‌ లెవల్‌ అధికారులు ఆరో తేదీన పోలింగ్‌ సిబ్బందితో పోలింగ్‌ కేంద్రాలలో బస చేయాలని ఆదేశించారు.

ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వహించాలని, తమ పరిధిలోని పోలింగ్‌ స్టేషన్‌లో పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించాలని, ఈనెల 4న జిల్లా స్థాయి అధికారులు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించే నాటికి వారికి అందుబాటులో ఉండి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది ప్రతి పోలింగ్‌కేంద్రంలో శారీరక వికలాంగులైన ఓటర్లకు, 80ఏళ్ల వయస్సు గల సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లకు వీల్‌ చైర్ల ద్వారా పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లి వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వలంటీర్లుగా సహాయ, సహకారాలు అందించాలన్నా రు.

ఎవరైనా ఎన్నికల విధుల్లో విఫలమైతే ఎన్నికల నియమావళి 134 సెక్షన్‌ ప్రకారం ఎన్నికల సంఘం తీసుకునే కఠిన శిక్షలకు అర్హులవుతారని అన్నారు. సిబ్బంది వ్యక్తిగత, చిన్న చిన్న సమస్యలను చూపి ఎన్నికల విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారులు బైరెడ్డి సింగారెడ్డి, అనిల్‌ ప్రకాశ్, అఖిలేష్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ రిటర్నింగ్‌ అధికారి హన్మంతునాయక్, తహసీల్దార్లు పాల్గొన్నారు.  

జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు 
ఈనెల 7న జరిగే పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ అన్నారు. సోమవారం 3 అసెంబ్లీ నియోజకవర్గాల సెక్టోరియల్‌ అధికారులు, ఓట్ల లెక్కింపు కేంద్రంలో పాల్గొనే అధికారులతో జిల్లా కేంద్రంలోని నెల్లికొండ నూతన వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న పోలింగ్‌ ముగిసిన తర్వాత నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల వారీగా ప్రిసైడింగ్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు పోలింగ్‌ మెటీరియల్‌ ద్వారా తీసుకొచ్చే ఈవీఎం రిసీవింగ్‌ పాయింట్లను స్పష్టంగా అర్థమయ్యేలా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

రిసీవింగ్‌ కౌంటర్లను ఏర్పాటు చేసి సెక్టోర్‌ నంబర్, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ వారీగా పరిశీలించి ఈవీఎం లు, కంట్రోల్‌ యూనిట్, వీవీ ప్యాట్‌లను రిసీవ్‌ చేసుకుని నియోజకవర్గాల వారీగా భద్రపర్చాలని అన్నారు. కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, నోడల్‌ అధికారి బైరెడ్డి సింగారెడ్డి, రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

పారదర్శకంగా ఎన్నికలు 
కొల్లాపూర్‌: అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి  కలెక్టర్‌ శ్రీధర్‌ సూచించారు. సోమవారం కొల్లాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాల నూతన భవనంలో సెక్టోరల్‌ బూత్‌ లెవల్‌ అధికారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ బూత్‌ల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

పోలింగ్‌ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ఓటు వేసే వారిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. వికలాంగులు, వృద్ధులను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వమే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఎవరైనా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను వాహనాలలో తరలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాములుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top