ఫేస్‌బుక్ ద్వారా ‘పోలీసు’ సేవలు | police services through facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ద్వారా ‘పోలీసు’ సేవలు

Sep 26 2014 3:02 AM | Updated on Oct 22 2018 6:02 PM

పోలీసులు తమ సేవలను వేగవంతం చేసేందుకు సోషల్ మీడియా సహాయం తీసుకుంటున్నారు.

నిజామాబాద్ క్రైం : పోలీసులు తమ సేవలను వేగవంతం చేసేందుకు సోషల్ మీడియా సహాయం తీసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 44 పోలీసు స్టేషన్లకు ప్రత్యేక పేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారం రోజుల్లో ఈ సేవ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రజల వద్దకు పోలీసులు అన్న నినాదంలో భాగంగా పోలీసు శాఖ ప్రతి పోలీసు స్టేషన్‌కు ఫేస్‌బుక్ ఐడీని ఏర్పాటు చేస్తోంది.

జిల్లాలో ఒక్కో పోలీసు స్టేషన్‌కు ఒక్కో ఐడీ నంబరు ఉంటుంది. దాని పాస్‌వర్డు స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ) వద్ద ఉంటుంది. ప్రజలు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కకుండానే తమ సమస్యలను ఫేస్‌బుక్ ద్వారా తెలపవచ్చు. గ్రామాలు, మండలాలు, పట్టణ ప్రాంతాల లో అసాంఘిక శక్తుల కదలికలు, మద్యం దుకాణాల ముందు మందు బాబుల ఆగడాలు, రౌడీల బెదిరింపులు, కళాశాలలు, షాపింగ్ సెంటర్లు, నెట్ సెంటర్ల వద్ద మహిళలను వేధించే పోకిరీల గురించి ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని ఫేస్‌బుక్ ఐడీకి సమాచారం ఇస్తే పోలీసులు వెంటనే స్పం దించి చర్యలు తీసుకోవాలనేది దీని ఉద్దేశం.

ఫేస్‌బుక్ ఐడీ కలిగిన ప్రతి ఒక్కరు పోలీసు స్టేషన్ ఫేస్‌బుక్ ఐడీని తమ అకౌంట్‌తో జత చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ద్వారా వచ్చిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు చూసుకుని స్పందిస్తారు. అలాగే ఫేస్‌బుక్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారు. జిల్లాలోని 44 పోలీసు స్టేషన్లతో పాటు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐల కార్యాలయాలకు సైతం ఫేస్‌బుక్ ఐడీ లు కేటాయించనున్నారు.

తమకు పోలీసు స్టేషన్‌లో న్యాయం జరగడం లేదని, అక్కడి అధికారులు నిందితులకే వత్తాసు పలుకుతున్నారని బాధితుడు భావిస్తే.. ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో సీఐ, ఎస్సైలతో పాటు కింది స్థాయి సిబ్బంది పారదర్శకంగా పనిచేసే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement