పాలమూరు సభపై టీడీపీ మల్లగుల్లాలు | Palamuru House struggled on the tdp | Sakshi
Sakshi News home page

పాలమూరు సభపై టీడీపీ మల్లగుల్లాలు

Apr 22 2015 1:43 AM | Updated on Jul 11 2019 7:38 PM

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో మంగళవారం భేటీ ....

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, జి.సాయన్న, గోపీనాథ్, వివేకానంద, కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్ హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాత్రం హాజరుకాలేదు. ఈ నెల 23న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న సభపై చర్చించుకున్నారు. జిల్లా నుంచి రేవంత్‌రెడ్డి మాత్రమే హాజరుకావడం గమనార్హం. సభ నిర్వహణను రేవంత్‌రెడ్డికి అప్పగించారు. చంద్రబాబు కాన్వాయ్‌ను మహబూబ్‌నగర్ సరిహద్దుల దాటించే బాధ్యతను రంగారెడ్డి ఎమ్మెల్యేలకు అప్పగించారు. వేరే పార్టీల్లోకి వెళ్లేవారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాకపోయినా, నైతికంగా ఎవరికివారే ఆలోచించుకోవాలని ఎర్రబెల్లి, రేవంత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

 బిల్డర్లు, మైనింగ్ వ్యాపారులకు ఆదర్శరైతుల వేషాలా?

ఆదర్శరైతుల ముసుగులో సొంత వ్యాపారాల కోసమే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతున్నారని టీటీడీఎల్పీ  నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. మైనింగ్ వ్యాపారం చేసుకునే గంగుల కమలాకర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి విద్యాసాగర్ వంటి వారిని రైతుల పేరుతో ఇజ్రాయెల్ పంపించడం సిగ్గుచేటని ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.  టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు  రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతారని చెప్పారు. ఒకవేళ వారు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎర్రబెల్లి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement