మావోల కొత్త కమిటీలు !

New committees of Mao! - Sakshi

    తెలంగాణ కమిటీ కార్యదర్శిగా యాప నారాయణ 

     తెలంగాణలో పట్టుకు ప్రయత్నం 

     పోలీసుల చేతిలో కీలక సమాచారం 

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో పూర్వవైభవం కోసం మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది. కమిటీల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త కమిటీలకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మార్చి 2న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులకు ఆపార్టీకి చెందిన కీలక సమాచారం చిక్కినట్లు చెబుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్‌ తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేడ్‌ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ల అనంతరం పోలీసులు ఆ పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టి సారించారు. 

మూడు జిల్లాలకో డివిజన్‌ కమిటీ 
ఉత్తర తెలంగాణలో కొత్తగా మావోయిస్టు పార్టీ డివిజన్‌ కమిటీలను పునరుద్ధరించింది. పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్త గా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి–కరీంనగర్‌–భూపాలపల్లి జయశంకర్‌–వరంగల్‌ జిల్లాలు కలిపి ఓ డివిజన్‌ కమిటీ కాగా, ఆ కమిటీకి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం–మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ, ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, ఆ కమిటీలు సుధాకర్, కూసం మంగు అలియాస్‌ లచ్చన్న ఏరియా కమిటీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు.

మంచిర్యాల–కొమురంభీం(ఎంకేబీ) డివిజనల్‌ కమిటీకి ఇంతకు ముందు ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవెల్లి, మంగి, చెన్నూర్‌–సిరిపూర్‌ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజనల్‌ కమిటీ కొత్తగా ఏర్పడగా దీనికి కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ కార్యదర్శిగా ఉన్నారు. దీని కింద చర్ల–శబరి ఏరియా కమిటీ, లోకే సారమ్మ అలియాస్‌ సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్షణ్‌ అలియాస్‌ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్‌ గెరిల్లా స్వా్కడ్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. చర్ల–శబరి ఏరియా కమిటీ కింద కోసీ అలియాస్‌ రజిత నేతృత్వంలో చర్ల లోకల్‌ ఆర్గనైజింగ్‌ స్వా్కడ్, ఉబ్బ మోహన్‌ నేతృత్వంలో శబరి లోకల్‌ ఆర్గనైజిగ్‌ స్క్వాడ్‌లు పనిచేస్తున్నట్లు సమాచారం.  

రాష్ట్ర కమిటీ పునర్‌వ్యవస్థీకరణ
మావోయిస్టు పార్టీ గతలలో ఉన్న కమిటీలకు స్వస్తి పలికింది.  రాష్ట్ర విభజన తర్వాత ఎన్‌టీఎస్‌జడ్‌సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్‌సీ) గా మార్చారు. ఆంధ్ర రాష్ట్ర కమిటీ కనుమరుగు కాగా ఏవోబీ కొనసాగుతోంది.  కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో మావోయిస్టు పార్టీ కూడా రాష్ట్ర కమిటీని పునర్‌ వ్యవస్థీకరించింది.  కేకేడబ్ల్యూను ఎత్తివేసి దాని స్థానంలో కొత్తగా 3 డివిజన్‌ కమిటీలు వేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్‌ లక్మ అలియాస్‌ హరిభూషణ్‌ నియమితులు కాగా.. సభ్యులుగా బండి ప్రకాశ్‌ అలియాస్‌ క్రాంతి, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌ను నియమించినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసుశాఖ మావోయిస్టుల వివరాలతో కూడి న వాల్‌పోస్టర్లను ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల వేయడం చర్చనీయాంశంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top