చీట్స్‌కు చెక్‌

Mobile App For T Chits - Sakshi

అమల్లోకి‘టీ–చిట్‌’ యాప్‌  

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ అమలు

ప్రయోగాత్మకంగా మహానగరంలో వినియోగం  

రిజిస్ట్రేషన్‌ శాఖ తాజా నిర్ణయం

సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో జరుగుతున్న చిట్‌ ఫండ్‌ కంపెనీల మోసాలను కళ్లెం వేసేందుకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ శాఖ చర్యలు చేపట్టింది. చిట్‌çఫండ్‌ కంపెనీల వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు దేశంలోనే మొదటిసారి బ్లాక్‌ చైన్‌ సిస్టంను అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక ‘టీ–చిట్‌’ యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌–మేడ్చల్‌– రంగారెడ్డి జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో నాలుగు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు చిట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అఫీసుల్లో కార్యకలాపాలను ప్రారంభించింది. వాస్తవానికి చిట్‌ఫండ్‌లపై నియంత్రణ చాలా అవసరం. అది లేకపోవంతో ఆయా సంస్థలు మోసాలకు పాల్పడటం, బోర్డు తీప్పేయడం పరిపాటిగా మారింది. కొన్ని చిట్‌ఫండ్స్‌ సంస్థలు రూ.వందల కోట్లకు ప్రజలను ముంచి బిచాణా ఎత్తేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రైజ్‌ బిడ్డర్‌కు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ప్రజల సొమ్మును ఇతర అవసరాలకు వాడుకోవడం సర్వసాధారణమైంది. దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖ చిట్‌ఫండ్స్‌పై దృష్టి సారించింది. చిట్‌ఫండ్‌ కంపెనీలన్నింటీని రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలోకి తెచ్చి వాటి ఆటలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించింది.  

15 వేల కోట్లపైనే లావాదేవీలు
హైదరాబాద్‌ మహానగర పరిధిలో సుమారు రూ.15 వేల కోట్ల వరకు చిట్‌ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. నగరం మొత్తం మీద 300 చిట్‌ఫండ్‌ కంపెనీలు ఉండగా, వాటికి మరో 845 శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రెండువేలకు పైగా గ్రూపులను నిర్వహిస్తున్నారు. చిట్‌ఫండ్‌ వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఖాతాదారులు తెలుసుకునేందుకు వీలుగా పారదర్శకంగా ఉండాలి. కానీ కంపెనీలు మాత్రం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరిస్తూన్నాయనే ఆరోపణలుకు జరుగుతున్న సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. తాజగా రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలోకి తెస్తున్నకారణంగా చిట్స్‌ కంపెనీ పూర్తి వివరాలు, డైరెకర్టర్లు, బ్యాంక్‌ ఖాతాలు, చిట్స్‌ గ్రూపులు, ఖాతాదారుల వివరాలు, ప్రతిని ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆన్‌లైన్‌లో పంపించి ఆమోదం పొందాలి. దీంతో చిట్స్‌ఫండ్‌ కంపెనీలు మోసాలకు పాల్పడేందుకు వీలుండదని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top