పట్టాలెక్కవా?

MMTS Railway Project Delayed In Hyderabad - Sakshi

రైల్వే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం నీడలు

సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లకేళ్లుగా అదే నిర్లక్ష్యం. నగరంలో చేపట్టిన రైల్వేప్రాజెక్టులన్నీ ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయి. 5 సంవత్సరాల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశలో ఇప్పటి వరకు ఒక్క లైన్‌ కూడా పూర్తి కాలేదు. గత ఏడాది డిసెంబర్‌ నాటికే రెండో దశ రైలు పట్టాలెక్కుతుందన్న హామీ ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి కూడా అమలయ్యే దాఖలాలు కనిపించడం లేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపు ప్రతిపాదనకు రెండేళ్లు దాటినా ఒక్క రాయి కూడా వేయలేదు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పగటి కలగామారింది. నగరంలోని మూడు ప్రధాన స్టేషన్‌లపైన ఒత్తిడిని తగ్గించేందుకు చర్లపల్లి, వట్టినాగులపల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వే టర్మినళ్లపై  ఎలాంటి కదలిక లేదు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఎంపీల సమావేశాలు కేవలం ప్రహసనంగా మారాయి. వచ్చే జనవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వేలో ప్రజల సమస్యలు, డిమాండ్‌లు, ప్రతిపాదనలపైన రేపు రైల్‌నిలయంలో  నిర్వహించనున్న ఎంపీల సమావేశం మరోసారి మొక్కుబడి జాబితాలో చేరిపోతుందా...లేక  ఏ ఒక్క ప్రాజెక్టునైనా సాధిస్తుందా...ప్రజల అవసరాలను, డిమాండ్‌లను ప్రతిపాదిస్తుందా... వేచి చూడాల్సిందే.

ఎంఎంటీఎస్‌ రెండో దశ నత్తనడక...
గత సంవత్సరం డిసెంబర్‌ నాటికి 10 కిలోమీటర్ల బొల్లారం–సికింద్రాబాద్‌ ఎంఎంటీఎస్‌ లైన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఏడాది గడిచింది. ఈ మార్గంలో భద్రతా కమిషన్‌ తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్లు రాలేదు. పట్టాలెక్కలేదు.ఈ ఏడాది  డిసెంబర్‌ నాటికి  ఘట్కేసర్‌ వరకు  ఎంఎంటీఎస్‌  రైళ్లు నడుపనున్నట్లు చెప్పారు. పటాన్‌చెరు–తెల్లాపూర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ పరుగులు తీస్తుందన్నారు. ఇప్పటి వరకు అతీ గతీ లేదు. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్‌ వరకు, అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు రైల్వేలైన్‌ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్తలైన్‌ల నిర్మాణం  రద్దయిపోయింది. మౌలాలీ–సనత్‌నగర్‌ మధ్య 5 కిలోమీటర్ల మేర రక్షణశాఖ భూముల్లో  రెండో దశ లైన్‌ల డబ్లింగ్, విద్యుదీకరణకు  రక్షణశాఖ నుంచి అనుమతి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికీ  పనులు పూర్తి కాలేదు. ఒక్క మాటలో  చెప్పాలంటే  ఎంఎంటీఎస్‌  రెండో దశ  పనులు  ఎక్కడ వేసిన గొంగళి  అక్కడే అన్నట్లుగా  ఉంది. 

ఇవీ పనులు......
రెండో దశలో ఘట్కేసర్‌ నుంచి మౌలాలీ వరకు 14 కిలోమీటర్లు కొత్త లైన్లు వేసి విద్యుదీకరించాలి. సనత్‌నగర్‌ నుంచి మౌలాలీ వరకు 23 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్‌ చేసి  విద్యుదీకరించవలసి ఉంది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్‌ వరకు ఉన్న సింగిల్‌ లైన్‌ డబుల్‌ చేసి విద్యుదీకరించవలసి ఉంది. బొల్లారం –మేడ్చల్‌ మధ్య మరో 14 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్‌ చేసి విద్యుదీకరించాలి. తెల్లాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు 10 కిలోమీటర్ల పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండో దశలో  ఫిరోజ్‌గూడ, సుచిత్ర జంక్షన్, బిహెచ్‌ఈఎల్, భూదేవీనగర్, మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేçషన్లు నిర్మించవలసి ఉంది. కానీ ఇప్పటి వరకు స్టేషన్‌ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. 

కదలిక లేని చర్లపల్లి టర్మినల్‌ ......
వట్టినాగులపల్లి టర్మినల్‌ ఇప్పట్లో నిర్మించలేకపోయినా, హైదరాబాద్‌ అవసరాల దృష్ట్యా  ఈ ఏడాది చర్లపల్లి టర్మినల్‌ విస్తరణ చేపట్టి వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఇటీవల ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. కానీ టెండర్లు ఖరారు కాలేదు. ఇప్పట్లో పనులు ప్రారంభమవుతాయన్న ఆశలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల పైన పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని 4వ రైల్వే టర్మినల్‌గా చర్లపల్లిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితం ప్రతిపాదించారు. సుమారు వంద ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ టర్మినల్‌ కోసం రూ.250 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గతేడాది రైల్వేశాఖ రూ.80 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. మొదట 6 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించి, కనీçసం 100 రైళ్ల రాకపోకలకు అనువుగా దీన్ని అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. 

యాదాద్రికి  ఎంఎంటీఎస్‌ అంతే సంగతులు..
లక్షలాది  మంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు మార్గంపైన కూడా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ ఏడాది టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం కూడా  ప్రతిష్టాత్మకంగానే భావించింది. కానీ నిధులు మాత్రం అందజేయలేదు. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లను పొడిగించి విద్యుదీకరించవలసి ఉంది. ఇందుకోసం రూ.330 కోట్లతో అంచనాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా  51 శాతం నిధులను, మిగతా 49 శాతం నిధులను రైల్వేశాఖ అందజేçయాల్సి ఉంది. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల  సికింద్రాబాద్‌ నుంచి నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోవలసి ఉంటుంది.  

అటకెక్కిన సికింద్రాబాద్‌ ఆధునీకరణ...
అంతర్జాతీయ ప్రమాణాల మేరకు, విమానాశ్రయంలోని సేవలు, సదుపాయాలను తలదన్నేవిధంగా  చారిత్రాత్మక సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రయాణికుల సదుపాయాలు, వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని భావించారు. మల్టిప్లెక్స్‌ థియేటర్‌లు, బడ్జెట్‌ హోటళ్లు, అత్యాధునిక వినోద సదుపాయాలతో   సికింద్రాబాద్‌ను ఒక అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన అటకెక్కింది. స్టేషన్‌లో నిర్మించతలపెట్టిన నాలుగో వంతెన నిర్మాణానికి కూడా ఇప్పటికీ మోక్షం కలుగలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top