మున్సిపాలిటీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు | Mixed results municipality elections adilabad | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

May 13 2014 1:59 AM | Updated on Mar 18 2019 9:02 PM

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పార్టీకి పట్టం గట్టారు.

    మున్సిపాలిటీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
     నాలుగు పురపాలక సంఘాల్లో హంగ్
     మంచిర్యాలలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ
     భైంసా బల్దియాను కైవసం చేసుకున్న ఎంఐఎం
     నిర్మల్‌లో బీఎస్పీ, బెల్లంపల్లిలో హస్తం ఆధిక్యం
     ఆదిలాబాద్, కాగజ్‌నగర్‌లలో కారు జోరు


 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పార్టీకి పట్టం గట్టారు. ఉత్కంఠగా ఎదు రు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలు వెలువడ్డాయి. మంచిర్యాలలో కాంగ్రెస్‌కు, భైంసాలో ఎంఐఎంకు స్పష్టమైన మెజారిటీ రాగా, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్‌లలో హంగ్ ఫలితాలు వచ్చాయి. మంచిర్యాల మున్సిపాలిటీలో రెండు పార్టీలకే  మొత్తం కౌన్సిలర్ స్థానాలు దక్కాయి.

 కాంగ్రెస్ పార్టీ 18 మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. టీఆర్‌ఎస్ 14 స్థానాలకు పరిమితమైంది. మొత్తం 32 స్థానాలున్న మంచిర్యాల బల్దియాలో 17 మంది కౌన్సిలర్ల మద్దతుంటే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. 23 స్థానాల్లో 12 చోట్ల విజయం సాధించింది. బీజేపీ ఆరు స్థానాలు గెలుచుకుంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రెండేసి స్థానాలను దక్కించుకోగలిగాయి. ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

 నిర్మల్‌లో దూసుకుపోయిన ‘ఏనుగు’
 నిర్మల్‌లో బీఎస్పీ అత్యధికంగా 16 స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన అనుచరులను బీఎస్పీ తరఫున బరిలో దించారు. ఐదుగురు స్వతంత్రుల మద్దతుతో చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ మొత్తం 36 కౌన్సిలర్ స్థానాలున్నా యి. ఎంఐఎం పది, కాంగ్రెస్ ఐదు, టీఆర్‌ఎస్ మూ డు, ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ బీ ఎస్పీకి మద్దతిచ్చే విషయమై తమ పార్టీ అధినేత ఓవైసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు జాబిర్ అహ్మద్ కూడా సోమవారం ప్రకటించారు. దీంతో అధ్యక్ష స్థానం కైవసం చేసుకునేందుకు బీఎస్పీకి మార్గం సుగమమైనట్లయింది.

 బెల్లంపల్లిలో ఆసక్తికరమైన ఫలితాలు
 బెల్లంపల్లి బల్దియా ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. కాంగ్రెస్ అత్యధికంగా 14 కౌన్సిలర్ స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్‌ఎస్ పది స్థానాలకు పరిమితమైంది. మొత్తం 34 స్థానాలున్న ఇక్కడ అధ్యక్ష పీఠం కాంగ్రెస్‌కు దక్కాలంటే మరో నలుగురు.. మొత్తం 18 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం పడుతోంది. ఇక్కడ టీడీపీ ఐదు, సీపీఐ రెండు, స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు.

 కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌లో కారు జోరు
 కాగజ్‌నగర్‌లో కారు జోరు కనిపించింది. ఈ మున్సిపాలిటీలో అత్యధికంగా 13 స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో ఇద్దరు కౌన్సిలర్ల మద్దతు అవసరం ఏర్పడుతోంది. ఇక్కడ స్వతంత్రులు పది మంది విజయం సాధించారు. కాంగ్రెస్ ఐదు స్థానాలకే పరిమితమైంది. మొత్తం 28 స్థానాలున్న ఈ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానం దక్కాలంటే 15 మంది సభ్యుల మెజారిటీ అవసరముంటుంది. ఆదిలాబాద్‌లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. ఆ పార్టీ అత్యధికంగా 14 స్థానాలను గెలుచుకుంది.
 కాంగ్రెస్, బీజేపీలు ఏడేసి కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎంఐఎం నాలుగు స్థానాలను గెలుచుకోగా, నలుగురు స్వతంత్రులు విజయం సాధించారు. మొత్తం 36 కౌన్సిలర్ స్థానాలున్న ఇక్కడ 19 స్థానాలు గెలుచుకుంటే చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కే అవకాశాలున్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు ఎంఐఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

 తుడిచిపెట్టుకు పోయిన టీడీపీ..
 తెలంగాణపై చంద్రబాబు వైఖరి, రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా జిల్లాలో బల్దియా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు గాను ఐదు చోట్ల ఆ పార్టీ ఖాతాను తెరవలేదు. ఒక్క బెల్లంపల్లిలో మాత్రం కేవలం ఐదు కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుని ఉనికిని కాపాడుకోగలిగింది. గతంతో పోల్చితే బీజేపీ కొంత బలపడింది. ఎక్కడా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయిలో కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోలేకపోయినా, ఆదిలాబాద్‌లో అత్యధికంగా ఎనిమిది కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుంది.
  అలాగే భైంసాలో ఆరు స్థానాలను గెలుచుకుని ఈ రెండు చోట్ల ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. సీపీఐ బెల్లంపల్లిలో రెండు కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోగలిగింది. ఎక్కడా ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుపొందని సీపీఎం ఉనికి కోల్పోయింది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాకు కూడా ఒక్క సీటు రాలేదు.

 ఆదిలాబాద్ (36)
 కాంగ్రెస్    07    
టీఆర్‌ఎస్    15
 బీజేపీ    08    
ఎంఐఎం    02
స్వతంత్రులు    04    
 
 నిర్మల్ (36)
 కాంగ్రెస్    05
 టీఆర్‌ఎస్    03
 బీఎస్పీ    16
 ఎంఐఎం    10
 స్వతంత్రులు    02
 
 భైంసా (23)
 కాంగ్రెస్    02
 టీఆర్‌ఎస్    02
 బీజేపీ    06
 ఎంఐఎం    12
 స్వతంత్రులు    01
 
 బెల్లంపల్లి(34)
 కాంగ్రెస్    14
 టీఆర్‌ఎస్    10
 టీడీపీ         05
 స్వతంత్రులు    03
 సీపీఐ         02
 
 మంచిర్యాల(32)
 కాంగ్రెస్       18
 టీఆర్‌ఎస్    14

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement