కాళేశ్వరం లింక్‌–7 పనుల వేగం పెంచండి

Minister Harish Rao Comments on Kaleshwaram Link-7 Works - Sakshi

అధికారులకు మంత్రి హరీశ్‌ ఆదేశం

ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో కాళేశ్వరం పనుల పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌ : కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కాళేశ్వరం పనులను వేగవంతం చేయాలని అధికారులను నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు–7కు చెందిన ప్యాకేజీ–20, 21, 22 పనుల పురోగతిని మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం సమీక్షించారు. ఈ పనులన్నీ పూర్తయితే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరువు కాటకాలు ఉండవని హరీశ్‌ అన్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం, కాళేశ్వరం పనులను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు ఈ రెండు జిల్లాల్లో ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో పర్యటించాలని మంత్రి నిర్ణయించారు. ఈ మూడు ప్యాకేజీల పర్యవేక్షణ కోసం ఒక ఎస్‌ఈని నియమించాలని శాఖ ఉన్నతాధికారులను హరీశ్‌ ఆదేశించారు. 21, 22 ప్యాకేజీల కింద కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రతిపాదించిన 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ మూడు ప్యాకేజీల పరిధిలో 8.50 టీఎంసీల స్టోరేజీ సామర్థ్యంతో 6 రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఆ మూడు కాల్వల పనుల్లో వేగం పెంచండి.. 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునియాదిగానిపల్లి కాల్వల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం, ఏజెన్సీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి గురువారం కాల్వల పనులను సమీక్షించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. కాలి నడకన కాల్వల వెంట పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయని శాసన సభ్యులకు మంత్రి సూచించారు. ఆదివారం ఈ మూడు కాల్వల పురోగతిపై మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. వీటికి సంబంధించిన భూ సేకరణ, ఇతర పనులను అడిగి తెలుసుకున్నారు. పిల్లాయిపల్లి కింద 32 గ్రామాలకు, బునియాదిగానిపల్లి కింద 48 గ్రామాలకు, ధర్మారెడ్డిపల్లి కింద 40 గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కాల్వల పరిధిలో కొత్తగా డిస్ట్రిబ్యూటరీ కాల్వలను తీసుకొచ్చామన్నారు. ప్రధాన కాల్వలను మొత్తం 210 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top