
సాక్షి, హైదరాబాద్: రైతు బీమాలో వయసు పరిమితి కారణంగా లక్షలాది మంది అన్నదాతలు ఆ పథకానికి దూరం కానున్నారు. 18 నుంచి 60 ఏళ్ల వయసు రైతులకే రూ.5 లక్షల బీమా కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో మిగిలినవారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవంగా వయో పరిమితి 70 ఏళ్ల వరకు ఉండేలా వ్యవసాయశాఖ మొదట్లో కసరత్తు చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చివరకు 60 ఏళ్లుగా నిర్ధారణ చేయడంతో అంతకన్నా ఎక్కువ వయసున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి రైతు నామినీల వివరాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా ధ్రువపత్రాలు ఇస్తారు.
వారికేదీ ధీమా?
రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు 60 ఏళ్లకు పైబడిన వారున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం సేకరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులున్నారు. రైతులకు సాధారణంగా 60–70 ఏళ్ల మధ్యకాలంలోనే ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు వస్తాయి. మరణాల శాతం కూడా అధికంగా ఉంటుందని బీమా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ ముందుగా అనుకున్నట్లుగా 70 ఏళ్ల వరకు బీమా కల్పిస్తే బాగుండేదని పలువురు రైతులు అంటున్నారు. సాధారణంగా బీమా వయో పరిమితి 55 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండదు. కానీ రైతులకు ప్రత్యేకంగా 70 ఏళ్ల వరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఎల్‌ఐసీని కోరాలని భావించింది. కానీ ఎందుకో వెనకడుగు వేసింది. 60–70 ఏళ్ల వయసులో రిస్క్ అధికం కాబట్టి ఎల్‌ఐసీ వర్గాలు ప్రీమియం అధికంగా కోరి ఉండొచ్చని అంటున్నారు.
కౌలు రైతులకు మొండిచేయే..
కౌలు రైతులకు బీమా వర్తింపచేయడం కుదరదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు పథకం కింద కూడా వారికి ప్రయోజనం కలగలేదు. బీమాలోనూ వారికి లబ్ధి జరగకుంటే విమర్శలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 15 లక్షల మంది దాకా ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో భూమి లేని పేదలకు కూడా బీమా కల్పించాలని ప్రభుత్వం భావించి కసరత్తు చేసింది. కానీ దీనిపై అడుగు ముందుకు వేయలేదు. అలాంటి పథకం తెస్తే కౌలు రైతులు కూడా బీమా పరిధిలోకి వచ్చేవారు.