వానమబ్బు వెక్కిరిస్తే ‘ఉపాది’ మేఘం కురిసింది..!

MGNREGA Employment Lakhs Of People In Telangana - Sakshi

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో రూ. 3 వేల కోట్ల ఉపాధి హామీ పనులు 

లక్షలాది మందికి ఆసరాగా గ్రామీణ ఉపాధి హామీ పథకం 

సాగు పనులు లేక ఉపాధి పనులకు పోటెత్తుతున్న వైనం 

చిన్న, సన్నకారు రైతులతోపాటు పెద్ద రైతులకూ ఇదే ఆదరువు 

నిరుద్యోగ యువత సైతం ఉపాధి వైపే మొగ్గు 

గ్రామీణ ప్రాంతాల్లో కల్పతరువుగా ఉపాధి పథకం 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు మందగించడంతో గ్రామాల్లో రైతులు, కూలీలకు పనులు దొరకడంలేదు. దీంతో పనులు లేక.. కైకిలి రాక ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదరువుగా నిలుస్తోంది. ఈ కష్టకాలంలో పట్టెడన్నం పెడుతూ కల్పతరువుగా మారింది. సాగు పనులు లేకపోవడంతో రైతులు, కూలీలు ఎర్రటి ఎండల్లోనూ ఉపాధి పనులకు వెళ్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 1,547 జాబ్‌ కార్డులు ఉండగా.. వారిలో 740 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. అంటే దాదాపు సగం మంది ఉపాధి పనులనే నమ్ముకుని బతుకు బండి లాగిస్తున్నారు. రెంజల్‌ ఒక్కటే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామీణ వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాలకు ఉపాధి పనులే అండగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఉపాధి పనుల నిమిత్తం చేసిన ఖర్చు చూస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అత్యధికంగా 2018–19లో ఏకంగా రూ.3,026 కోట్లు ఖర్చు కావడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ చిన్న, సన్నకారు రైతాంగానికి కరువు కాలంలో ఉపాధి హామీ పనులు అండగా నిలుస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! 

రబీ వట్టిపోయింది..  
రాష్ట్రంలో ఈ ఏడాది రబీ సీజన్‌ నిరాశాజనకంగా మారింది. 17 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు గతేడాది నైరుతి రుతుపవనాలు నిరాశాజనకంగా ఉండటం, ఆ తర్వాత వచ్చిన ఈశాన్య రుతుపవనాలూ అలాగే ఉండటంతో భూగర్భ జలాలు పడిపోయాయి. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో నీటి వనరులు కూడా అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో తాగు, సాగునీటికి కటకట ఏర్పడింది. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో కూడా గత మూడు నెలలుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తేల్చి చెప్పింది.

వరంగల్‌ రూరల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూలు, సూర్యాపేట, నల్లగొండల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు తెలిపింది. గతేడాది మార్చిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.88 మీటర్ల లోతులో లభించగా, ఈ ఏడాది మార్చిలో 13.40 మీటర్ల లోతుకి వెళ్లిపోయాయి. దీంతో నీళ్లు లేక చాలా పంటలు ఎండిపోయాయి. రబీలో సాగు చేసిన మొత్తంలో 30 శాతం మేర పంటలు ఎండిపోయినట్టు అంచనా. రబీలో అన్ని పంటల సాధారణ    

సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, 29.67 లక్షల (89%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.65 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.50 లక్షల (99%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. కానీ నీటి వనరులు లేకపోవడంతో పరిస్థితి ఘోరంగా మారింది. వ్యవసాయశాఖ తాజాగా వేసిన అనధికారిక అంచనా ప్రకారం దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయింది. రాష్ట్రంలో గత ఖరీఫ్, ప్రస్తుత రబీ సీజన్‌లలో కలిసి ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 92.35 లక్షల టన్నులు కాగా, 2017–18లో ఇది 96.20 లక్షల టన్నులుగా ఉంది. అత్యధికంగా రబీలో 15.65 లక్షల టన్నులు తగ్గింది. 

ఆదుకున్న ఉపాధి... 
వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ పనులు జరగకపోవడంతో గ్రామాల్లో రైతులు, కూలీలకు పనులు దొరకడంలేదు. దీంతో అలాంటివారందరికీ ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఏకంగా రోజుకు రూ.4.5 కోట్ల మేర చెల్లింపులు జరుపుతూ వారిని అక్కున చేర్చుకున్నాయి. రాష్ట్రంలో 51.3 లక్షల జాబ్‌కార్డులుండగా.. 42.4 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 11.7 కోట్ల పనిదినాలు కల్పించగా, 25.2 లక్షల కుటుంబాలు ఈ పనులపై పూర్తిగా ఆధారపడ్డాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతుల్లో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. 

రబీలో పంటలు ఎండిపోవడం, సాగు పనులు సరిగా సాగకపోవడంతో వీరంతా ఉపాధి హామీ వైపు చూస్తున్నారని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఉపాధి పనులకు వెళుతున్నవారిలో చిన్న, సన్నకారు రైతులే కాకుండా.. 5 నుంచి పదెకరాలున్న అన్నదాతలు కూడా ఉన్నారని తేలింది. వీరితోపాటు నిరుద్యోగులకు కూడా ఉపాధి హామీయే భరోసా కల్పిస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్న యువత కూడా ఉపాధి పనులకు వెళుతోంది. వ్యవసాయ పనులు లేక పట్టణాలకు వచ్చిన రైతులు, కూలీలు ఏవో చిన్నపనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తుండగా.. గ్రామాల్లోనే ఉన్నవారు మాత్రం ఉపాధి హామీ పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు.  
 
ఉపాధి పనులే ఆసరా 
ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్తున్న. వ్యవసాయ పనులు ముగియడంతో ఉపాధి హామీ పథకంలో కూలి పని ఆసరాగా ఉంది. రోజువారి కూలి కింద రూ.210 ఇస్తుండ్రు. అధికారులు చూపిన కొలతల ప్రకారం వారం రోజులు పనిచేస్తే రూ.1400 వస్తయి. అదే నెల రోజులకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు కూలి పడుతుంది. ఇప్పుడు వేసవికాలం కావడంతో వ్యవసాయ పనులు దొరకడం కష్టంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకంలో దినసరి కూలీగా వెళ్లి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాను. 
– కౌసల్యబాయి, ఉపాధి కూలీ, ఖిర్డి వాంకిడి, ఆసిఫాబాద్‌ జిల్లా
 
నాకూ ఉపాధి దొరికింది 
నేను కూడా ఉపాధి కూలీ పనులకే పోతున్నా. చదువుకున్నప్పటికీ సరైన పనులు దొరకడంలేదు. వ్యవసాయం చేసుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి. అందువల్ల నాలాంటి యువత కూడా ఉపాధి హామీ పనుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఊరికే ఉండడం బదులు ఈ పనికి పోతే ఊరికి కొంత మేలు చేసిన సంతృప్తి కూడా మిగులుతుంది. 
– బొడపట్ల రమేష్, ఉపాధి కూలీ
 
డిగ్రీ చదివినా ఉపాధే దిక్కైంది 
నేను డిగ్రీ చదివాను. నాన్నకు వ్యవసాయంలో చేదోడువాదోడుగానే ఉంటూ నా మిత్రులతో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నాను. దాదాపు పదేళ్లుగా ఉపాధి పనులు చేస్తున్నాను. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మరింత బాగుంటుంది. అటు రైతుల కష్టాలు, ఇటు కూలీల కష్టాలు తీరతాయి. 
– సంజీవ్, జైనథ్‌ మండలం లక్ష్మీపూర్, ఆదిలాబాద్‌ జిల్లా 
 

వంద రోజుల పనే తిండి పెడుతోంది 
ఎండా కాలంలో ఉపాధి హామీ పథకమే వంద రోజుల తిండి పెడుతోంది. ఇప్పుడు వ్యవసాయ పనులు లేవు. వేసవి కావడం వల్ల ఉదయం 6 గంటలకు పనికి వెళ్లాల్సి వస్తుంది. రోజుకు రూ.200 వరకు కూలి వస్తుంది. వంద రోజుల పని లేకుంటే మా కుటుంబం పస్తులు ఉండాల్సి వస్తుంది.  
– జి.వనమ్మ, సీతానాగారం 
 

కరువు పనులతోనే కైకిలి 
నాకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. వరి వేసినం. నీరులేక ఎండిపోయింది. చేసేందుకు వేరే పని ఏదీ లేకపోవడంతో ఉపాధి పనికి పోతున్నాను. కరువు పనులతోనే కైకిలి దొరుకుతోంది. నిరుడు 100 రోజుల పనిపూర్తి చేసిన. ఈ పని దినాలను 150 రోజులకు పెంచితే నాలోంటోళ్లకు మరింత ఉపాధి కల్పించినట్లు అవుతుంది.  
– వంగపెల్లి మల్లవ్వ, నిజామాబాద్‌ 
 
పూడిక పనులకు వెళ్తున్నా 
నెల రోజుల నుంచి నల్ల చెరువుల పూడిక తీత పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ పనులు లేని కరువు పరిస్థితుల్లో వంద రోజుల పనితో ఉపాధి పొందుతున్నాం. నాలుగు వారాల నుంచి వంద రోజుల పనికి పోతున్నా. 
– టి.సాంబయ్య, కానిపర్తి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా 

సరిపడా పరదాలు లెవ్వు 
వంద రోజుల పనికి రోజుకు 200 మంది దాకా పోతున్నాం. ఉన్న రెండు పరదాలు ఇంత మందికి సరిపోతలెవ్వు. ఇంకో వారం పది రోజులైతే ఇంకా ఎక్కువ మంది వత్తరు. వంద రోజుల పని కాడ నీడ కోసం అందరికి సరిపడా పరదాలు లేక ఇబ్బంది అవుతుంది. ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లెవ్వు. రెండేండ్ల నుంచి గడ్డపారలు ఇయ్యనేలేదు. 
– కన్నెబోయిన సరోజన, కానిపర్తి
   

ఈ పని లేకపోతే డొక్క ఎండుడే 
కరువు కాలం మోపయింది. వానలు పడక చెరువులు, కుంటలు మొత్తం ఎండిపాయే. తాగుదామంటనే నీళ్లు దొరుకుతలేవాయే. ఇగ వ్యవసాయం ఎట్ల చేసుడు. ఉపాధి హామీ పథకంతోనే ఇంత పనులు దొరికి ఇళ్లు గడుస్తోంది. ఈ పని కూడా లేకపోతే ఆకలితో మాడి డొక్కలు ఎండుడే.  
– రెడ్డి శంకర్, ఉపాధి కూలి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top