నగర విద్యార్థులకు జలగండం

నగర విద్యార్థులకు జలగండం

 •     మొన్న బియాస్.. నిన్న డిండి.. నేడు సరయూ..

 •      21 మంది మృత్యువాత

 •      తాజాగా సరయూ నదిలో మరో ఇద్దరి గల్లంతు

 •      నెలరోజుల్లోనే మూడు దుర్ఘటనలు

 •      ఆందోళన చెందుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

 •      అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

 • నగర విద్యార్థులకు జలగండం పొంచి ఉన్నట్టుంది. నెలరోజుల వ్యవధిలో వరుసగా జరిగిన మూడు ఘటనలను పరిశీలిస్తే ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ఆయా నదులు, ప్రాజెక్టుల్లో సరాదాగా ఫొటోలు దిగుతున్న సమయంలోనే విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కడుపుకోతను భరించలేకతల్లడిల్లిపోతున్నారు.

   

  నగర విద్యార్థులు బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు జలాశయాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. నెలరోజుల వ్యవధిలోనే వేర్వేరు ప్రమాదాల్లో నగరానికి చెందిన 21 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తాజాగా బుధవారం సరయూ నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతవడం కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. నగర వాసులనూ తీవ్రంగా కలిచివేసింది. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో 16 మంది సిటీ విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయి మరణించిన హృదయవిదారక ఘటన మరవక ముందే.. గత సోమవారం నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో మరో ఐదుగురు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది.  తాజాగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదిలోకి సరదాగా దిగిన మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలను పరిశీలిస్తే.. జలక్రీడలు, జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ సరదాగా గడపడంతోపాటు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించేందుకు మక్కువ చూపుతోన్న విద్యార్థులుసరదా మాటున పొంచిఉన్న ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుస్తోంది.  అక్కడి పరిస్థితులను పసిగట్టలేకపోవడం వల్లే ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏదేని కొత్త ప్రాంతానికి వెళ్లిన వారికి ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, జలాశయాలు, నదుల ప్రవాహ రీతులు, లోతు, ప్రమాదం జరిగేంద ుకు ఆస్కారమున్న ప్రదేశాలపై సంపూర్ణ అవగాహన లేకపోవడం కూడా కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు గల్లంతైన విద్యార్థుల్లో ఈత రానివారే అధికంగా ఉన్నారు.  ఒకవేళ మోస్తరుగా ఈత వచ్చినా.. గతంలో స్విమ్మింగ్ పూల్‌లో ఈదిన అనుభవం మినహా సువిశాలమైన జలాశయాల్లో ఈదే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవడం కూడా శాపంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌గేమ్స్‌తో సేదదీరాలనుకొని పర్యాటక, అధ్యయన టూర్లకు వెళ్తున్న నగర విద్యార్థులు తమ వెంట లైఫ్‌జాకెట్లు తీసుకెళ్లకపోవడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, కనీసం వాటిని వెంట తీసుకెళ్లాలని చెప్పే వారూ లేకపోవడంతోనే వరుస అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.

   

   పరిష్కారమార్గాలివే...

   ఆయా జలాశయాల వద్ద వరుసగా జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖ కెరీర్ కౌన్సెలింగ్ నిపుణుడు, సామాజిక వేత్త ఆకెళ్ల రాఘవేంద్ర  సూచిస్తున్న పరిష్కారాలివీ...

   

   విద్యార్థులు నగరం దాటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కళాశాల యాజమాన్యాలు లేదా తల్లిదండ్రులు, టూరు నిర్వాహకులు కనీస జాగ్రత్తలను విధిగా వారికి చెప్పాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే ఘోర దుర్ఘటనలు జరుగుతున్నాయి.

   

   సంబంధిత పర్యాటక ప్రదేశంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ ద్వారా ప్రజెంటేషన్ చూపించాలి. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ టెక్నాలజీ ఆధారంగా ప్రజెంటేషన్ సాగాలి.

   

   వెళ్లే ప్రాంతంపై ముందుగా భౌగోళిక అవగాహన కల్పించాలి. అక్కడి వాతావరణ అనుకూలతలు, ప్రతికూల పరిస్థితులపై అవగాహన కల్పించాలి.

   

   తగిన జాగ్రత్తలు సూచించినప్పుడు విద్యార్థులు సైతం వినాల్సి ఉంటుంది. ప్రమోదం మాటునే ప్రమాదం  పొంచి ఉందన్న విషయం మరవరాదు.

   

   ప్రస్తుత విద్యావిధానంలో తరగతి గదులు, ప్రత్యేక క్లాసులతో బిజీ అవుతున్న విద్యార్థులకు ఈత వంటి ఆత్మరక్షణ అంశాల్లో ప్రావీణ్యం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, క ళాశాలల యాజమాన్యాలు చొరవ తీసుకొని వీటిని నేర్పించేందుకు కృషిచేయాలి.

   

   కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు విధిగా ఆయా ప్రాంతాల్లో పర్యాటక శాఖ గుర్తింపు పొందిన గైడ్‌ను వెంట తీసుకెళ్లాలి.

   

   బృందాలుగా పర్యటన చేస్తున్న సమయంలో సదరు విషయాన్ని అక్కడి స్థానిక రెవెన్యూ, పోలీసు యంత్రాగానికి తెలపాలి. అప్పుడే అనర్థాలు జరిగినపుడు వెంటనే వారు రంగంలోకి దిగే వీలుంటుంది. ముందుగానే తగిన జాగ్రత్తలు సూచించే వీలుంటుంది.

   

   కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు పరిసరాల పట్ల ఆచితూచి వ్యవహరించాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కెమెరాల్లో ఫొటోలు బంధిస్తున్నప్పుడు అదుపుతప్పి నీటిలో జారిపడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

   

   తప్పనిసరి పరిస్థితుల్లో నీటిలోకి దిగాల్సి వస్తే లైఫ్ జాకెట్లు ధరించాలి. తేలికపాటి బోట్లు, స్థానికుల సహకారం తీసుకోవాలి.

   

   వెంట తీసుకెళ్లే ఫ్యాకల్టీ విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.  

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top