‘నారా కుటుంబాన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలి’

Lakshmi Parvathi Pays Tribute to NTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నారా కుటుంబాన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలన్నారు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడి ఆయన వారసుల్లో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలన్నారు. బాబు ఎన్టీఆర్‌ వారసుల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే ఎమ్మెల్యే సీటు ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెట్టడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు. కానీ జయంతి వర్ధంతికి తేడా తెలియని తన కొడుకుని మంత్రిని చేసి కాబోయే సీఎం అనడం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలని హరికృష్ణ ప్రత్యేకంగా అడగాలా.. ఆయన వారసునిగా సీఎంగానో, ఇతర ముఖ్యస్థానంలో ఉండాల్సిన హరికృష్ణను ఇలాంటి స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. 

పార్టీని మళ్లీ కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టే ప్రయత్నాలు: బాబు తెలుగుదేశం పార్టీని మళ్లీ కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనిని ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకోవాలని లక్ష్మీ పార్వతి కోరారు. ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఆత్మగౌరవంతో  వచ్చిన పార్టీని ఆత్మ వంచన పార్టీగా మార్చి అమ్మేందుకు సిద్ధపడుతున్న బాబు ఒక పెద్ద ఆక్టోపస్, రాబందు అని పేర్కొన్నారు. నిన్నటి వరకు సీఎం అవ్వటానికే బాబు ఎన్టీఆర్‌ను గద్దెదించాడని భావించాను. కానీ ఎన్నికల ముందే ఆనాటి కాంగ్రెస్ ప్రధానితో చేతులు కలిపి ఎన్టీఆర్‌ను ఓడించి ప్రధాని కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నినట్లు తెలిసిందన్నారు. 

ఏర్పాట్లలో చాలా తేడా : గత జయంతి వేడుకలకి ఈ జయంతికి ఘాట్ వద్ద ఏర్పాట్లలో చాలా తేడా ఉందని లక్ష్మీ పార్వతి అన్నారు. ఘాట్ పరిసరాలు, రోడ్డు ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోవటం చూస్తే ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేయటంలో భాగమనిపిస్తోందని తెలిపారు. భారత రత్నను ఎన్టీఆర్‌కు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన అభిమానులు అర్థం చేసుకోవాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top