కేటీపీఎస్‌ ప్రస్థానంలో మరో మైలురాయి

Ktps another milestone  - Sakshi

తుదిదశకు ఏడో దశ నిర్మాణ పనులు

విజయవంతంగా పూర్తయిన స్టీమ్‌ బ్లోయింగ్‌

26న సింక్రనైజేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు

వచ్చేనెల 8న పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభానికి కసరత్తు

సాక్షి, కొత్తగూడెం: కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) సుదీర్ఘ ప్రస్థానంలో 7వ దశ మరో మైలురాయిగా నిలవనుంది. అర్ధ శతాబ్దకాలంగా వెలుగులు విరజిమ్ముతున్న కేటీపీఎస్‌ సరికొత్త రూపు సంతరించుకోనుంది. 1966 జూలై 4 నుంచి వివిధ దశల్లో విస్తరిస్తూ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చే విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. జూలైలో అందుబాటులోకి రానున్న 7వ దశ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభమైతే ప్రతిరోజూ కేటీపీఎస్‌ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు 2,460 మెగావాట్ల విద్యుత్తు సరఫరా కానుంది.

ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న 6 దశల ప్లాంట్ల ద్వారా (60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3వ యూనిట్‌ మూతపడిన తరువాత) 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. రూ.5,200 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన 7వ దశ ప్లాంట్‌ ద్వారా జూలై 8 నుంచి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేసేందుకు జెన్‌కో రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేటీపీఎస్‌ ఖ్యాతి మరింత విస్తరించనుంది.

అనేక అవాంతరాలను అధిగమిస్తూ..
2015 డిసెంబరులో 7వ దశ ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అనేక అవాంతరాలను అధిగమిస్తూ తుది దశకు చేరుకుంది. గత డిసెంబరు నెలలో ట్రాక్‌ ఆర్డర్‌ వద్ద టీపీ–3 ట్రాన్స్‌ఫార్మర్‌ కుప్పకూలింది. ఈ నెలలో సాంకేతిక లోపం కారణంగా స్టేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది.

కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇలాంటి పలు అవాంతరాలను అధిగమిస్తూ 7వ దశ నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్‌ పూర్తి చేసింది. కీలకమైన మొదటి విడత లైటప్‌ పనులు జనవరి 31న పూర్తి చేశారు. యాసిడ్‌ క్లీనింగ్‌ పనులు, స్టీమ్‌ బ్లోయింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం వాల్వ్స్‌ సెట్టింగ్, రోలింగ్‌ టెస్టింగ్, పైప్‌ కంట్రోల్‌ వాల్వ్స్, గేజ్‌లు టెస్ట్‌ చేస్తున్నారు.

టర్బైన్‌ పరీక్షించి జూన్‌ 20 నుంచి 25లోగా సింక్రనైజేషన్‌ చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేయిస్తున్నారు. కోల్‌ ప్లాంట్, చిమ్నీ, కూలింగ్‌ టవర్, స్విచ్‌ యార్డు, ఫ్యూయల్‌ ఆయిల్‌ సిస్టమ్, రా వాటర్‌ రిజర్వాయర్ల పనులన్నీ 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. సర్వీస్‌ బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, క్యాంటీన్‌ బిల్డింగ్‌ పనులు 80 శాతం పూర్తయ్యాయి.

26న సింక్రనైజేషన్‌కు ఏర్పాట్లు
ఈ నెల 26న సింక్రనైజేషన్‌ చేసేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిసారి విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు (ట్రాన్స్‌కో) అనుసంధానం చేసే ప్రక్రియను సింక్రనైజేషన్‌ అంటారు. ఇప్పటికే బాయిలర్‌ పనులన్నీ పూర్తి కాగా గత ఏప్రిల్, మే నెలల్లోనే బాయిలర్‌లోని వేలాది పైపులైన్లను శుద్ధిచేసే ప్రక్రియ (స్టీం బ్లోయింగ్‌) పనులు కూడా విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం అన్ని పైపుల్లో టెస్టింగ్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే సింక్రనైజేషన్‌ చేయడమే. ఇది పూర్తయ్యాక వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేసేందుకు నిర్ణయించారు.

సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో..
కేటీపీఎస్‌లో ఇప్పటి వరకు ఉన్న 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లు సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ పద్ధతిలో విద్యుదుత్పత్తి చేసేవే. ఈ నేపథ్యంలో 7వ దశ ప్లాంట్‌ను ఆధునిక సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించారు. సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో పోల్చుకుంటే సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీలో తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. 7వ దశలో భారీ నిర్మాణాలను బీహెచ్‌ఈఎల్‌ సంస్థ అనుకున్న సమయానికన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేసింది.

800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాయిలర్‌ను నిర్మించేందుకు 42 నెలలు నిర్దేశించుకోగా, 24 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. 2016 జూలైలో ప్రారంభమైన కూలింగ్‌టవర్‌ నిర్మాణం 2017 డిసెంబర్‌ నాటికి (18నెలల్లో) నిర్మాణం పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించినట్లు జెన్‌కో అధికారులు చెబుతున్నారు. 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ(షెల్‌) నిర్మాణం పనులు 20 నెలల్లో విజయవంతంగా పూర్తి చేశారు.

370 మీటర్ల పొడవైన ట్రాక్‌ ఆపర్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ట్రాక్‌పై ఒకేసారి 58 బోగీలు (1 ర్యాక్‌) ద్వారా 60 వేల టన్నుల బొగ్గు దిగుమతి అవుతుంది. మండించేందుకు ఈ ప్లాంట్‌కు ఒక రోజుకు 12 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. ఇక వ్యాగన్‌ టిప్లర్‌ పనులు నెలరోజుల్లో పూర్తి అయ్యాయి. బోగీ ఆగగానే బొగ్గు భూగర్భంలోకి జారిపోతుంది.

8 నాటికి పూర్తి స్థాయిలో..
7వ దశ ప్లాంట్‌ నుంచి వచ్చే నెల 8వ తేదీ కల్లా విద్యుదుత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల చివరి వారం లో సింక్రనైజేషన్‌ చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందకు వెళుతున్నాం. సింక్రనైజేషన్‌ తర్వాత ముఖ్యమైన పనులు పూర్తి చేసి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి దిశగా వెళతాం. విద్యుదుత్పత్తి ప్రక్రియ నడిపిస్తూనే బయట ప్రాంగణంలో పెండింగ్‌లో ఉన్న సివిల్‌ పనులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేస్తాం. – సమ్మయ్య, చీఫ్‌ ఇంజనీరు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top