వచ్చేస్తోంది జల‘సాగరం’

Krishna flood that is going to increase from today - Sakshi

ఎగువన 25సెం.మీ చొప్పున నాలుగురోజులుగా వర్షాలు

నేటి నుంచి మరింతగా పెరగనున్న కృష్ణమ్మ వరద

సాక్షి, హైదరాబాద్‌: పదిహేను రోజులుగా ఎగువన కురుస్తున్న కుంభవృష్టితో కృష్ణానదికి భారీ వరదలొస్తున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో 3, 4 రోజులుగా రోజుకు సగటున 25 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుండడంతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మరో రెండు, మూడ్రోజుల్లో శ్రీశైలం నిండనుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (ఎన్నెస్పీ)కు నీటిని విడుదల చేస్తారు. సాగర్‌కు నీరు త్వరలోనే వస్తోందనే వార్తతో పరీవాహక ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సకాలంలో కురవని వర్షాలు, సాగర్‌లో అడుగంటిన నీటి మట్టాలతో జూన్, జూలైలో ఖరీఫ్‌ డీలాపడగా.. ఇకపై పుంజు కోనుంది. ఇప్పటికే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా 82వేల క్యూసెక్కుల నీటిని వినియోగి స్తుండగా.. సాగర్‌కు 74వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 135 టీఎంసీల నీరుంది.

శ్రీశైలంకు డబుల్‌ వరద
కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద కిందకు వదులుతున్నారు. దీనికితోడు మహారాష్ట్ర లో భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు సైతం పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి 1.25లక్షల క్యూసెక్కులకు పైగా భారీ ప్రవాహాలు దిగువకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దిక్కుల నుంచి ఉధృతంగా వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోనుంది. గురువా రం నుంచి 5లక్షల క్యూసెక్కుల మేర వరద ఈ ప్రాజెక్టులోకి చేరే అవకాశముంది. 2 రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోనుంది.

మరో 59 టీఎంసీలు నిండితే..
ఎగువన వర్షాలతో మరింత వరద వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి నిల్వలను ఖాళీ చేయాలని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఆల్మట్టిలో 90టీఎంసీల మేర మాత్రమే ఉంచి 4లక్షల క్యూసెక్కులు, నారాయణ పూర్‌లో 22 టీఎంసీలు మాత్రమే ఉంచి 4.64 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ నీరంతా జూరాలకు వస్తోంది. ప్రస్తుతం జూరాలకు 3.25లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతుండగా, 3.47లక్షల క్యూసె క్కుల నీటి ని శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి బుధవారం ఏకంగా 2.81 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 215.8టీఎంసీలకుగానూ 156 టీఎంసీల నీరు చేరింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయానికల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని నీటిపారుదల అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 17 సెం.మీ. కుండపోత వర్షం కురిసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  అలాగే రాష్ట్రంలోని  జయశంకర్‌ భూపాల్‌పల్లి, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. 

తాగునీటికి పక్కనపెట్టి.. మిగతాది సాగుకు
ఏఎమ్మార్పీ కింద, హైదరాబాద్‌ జంట నగరాలకు, మిషన్‌ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకై సాగర్‌ కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన కనిష్టంగా 30 టీఎంసీల మేర నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు విడుదలయ్యే అవకాశం ఉంది. 

రేపు కృష్ణా బోర్డు సమావేశం
శ్రీశైలం, సాగర్‌లో ఉన్న లభ్యత జలాలు, వాటి పంపకంపై చర్చించేందుకు ఈ నెల9న కృష్ణా బోర్డు భేటీ కానుంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలు తమ తమ అవసరాలపై చర్చించనున్నాయి. ఇందులోనే సాగర్‌ కింది తాగు, సాగు అవసరాలపై చర్చ జరగనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top