'చైనా మాదిరిగా ఉద్యమం చేపట్టాలి'

Koppula Eswar Attended The Harithaharam Programme In Manthani, Peddapalli - Sakshi

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

సాక్షి, మంథని : ‘చైనాలో పర్యావరణ విపత్తు సంభవించినప్పుడు అక్కడి ప్రభుత్వం చాలెంజ్‌గా తీసుకుంది. 600 కోట్ల మొక్కలు నాటి గ్రేట్‌ గ్రీన్‌ ఆప్‌ చైనాగా సమస్యను పరిష్కరించుకుంది. పర్యావరణ సమతుల్య సాధనకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యో రామగుండంలో అదే మాదిరిగా ఉద్యమం చేపట్టాలి’ అని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. సింగేరేణి సంస్థ ఆర్జీ– 3, అడ్రియాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంథని మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలవాగు కరకట్టపై హరితాహారం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మంత్రి కొప్పులతో పాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధు, పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యే డి. శ్రీధర్‌ బాబు, సింగరేణి సంస్థ డైరెక్టర్‌ చంద్రశేఖర్, జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా కరకట్టపై మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. మానవ మనుగడకు ముడిపడి ఉన్న పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అడవులశాతాన్ని పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. నాలుగు విడతల్లో నాటిన మొక్కల్లో 48శాతమే మిగిలాయని, సింగరేణి గనులు విస్తరించి ఉన్న రామగుండం అగ్నిగుండంలా మారిందన్నారు. ఇక్కడ ఆ పరిస్థితులు అధిగమించడానికి సింగరేణి అధికారులు దృష్టి సారించాలన్నారు.

జిల్లాలో కోటి 95లక్షల మొక్కలు నాటడం టార్గెట్‌గా ఉందని, ఇప్పటి వరకు25 లక్షల మొక్కలే నాటారన్నారు. కోతులు గ్రామాలకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అడవికి పంపేందుకు జగిత్యాల జిల్లా మాదిరిగా ఇక్కడా చర్యలు చేపట్టాలని తెలిపారు. సింగరేణి, నీటి పారుదలశాఖల పరిధిలో భూములు కోల్పోయిన వారి సమస్యల సాధనకు కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మంథని మున్సిపాలిటీలో ఇంత పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన సింగరేణికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు. సింగరేణి సంస్థ డైరెక్టర్‌(పా)చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రెండేళ్లలో రెండు కోట్ల మొక్కలు నాటామన్నారు. సింగరేణి కాలరీస్‌ పరిధిలో స్థలాలు లేకపోవడంతో మున్సిపల్, మేజర్‌ పంచాయతీల్లోనూ మొక్కలు నాటుతున్నామన్నారు. మంథని ఆర్డీవో నగేష్, మంథని ప్రత్యేక అధికారి బోనరిగి శ్రీనివాస్, సింగరేణి గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జనరల్‌ మేనేజర్లు సూర్యనారాయణ, వీరారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top