మళ్లీ చేతితో కలిసి సాగుతున్నా సురేఖ

Konda Surekha Election Campaign In Warangal - Sakshi

 పరకాల రోడ్‌ షోలో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ

జనసంద్రంగా మారిన పరకాల ప్రధాన రహదారులు 

సాక్షి, పరకాల: గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియో జకవర్గానికి వెళ్లిన తాను మళ్లీ పరకాలకు రావడంతో తల్లిగారింటికి వచ్చినంత సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు.  పరకాల మహాకూటమి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా కొండా దంపతులు పరకాల పట్టణంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ రోడ్‌ షో నిర్వహించారు. నామినేషన్‌ వేయడానికి చివరి రోజు కావడంతో తన భర్త ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, కూతురు సుస్మిత పటేల్‌తో కలిసి మధ్యాహ్నం 12 గంటలకే పరకాలకు చేరుకున్నారు.

అరగంట సమయంలోనే నామినేష న్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఎన్నికల రిటర్నిం గ్‌ అధికారి సీహెచ్‌ మహేందర్‌జీకి నామినేషన్‌ పత్రాలు అందజేసిన అనంతరం వారు తిరిగి గీసుకొండ మండలం వంచనగిరిలోని శ్రీసాయి మంది ర్‌లో ప్రత్యేక పూజలు చేసుకొని మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు పరకాలకు చేరుకొని పట్టణంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌షోకు వేలాది మంది కార్యకర్తలను తరలించడంతో పరకాల ప్రధాన రహదారులు జనసద్రంగా మారాయి. సుమారు 2 కిలోమీటర్ల వరకు రోడ్డు పొడవునా కాంగ్రెస్‌ కార్యకర్తలే కనిపించారు. కళాకారులు, మహిళలు కోలాటం, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.

పరకాల ప్రజలకు అండగా నిలుస్తాం
ధర్మారెడ్డి పుణ్యమా అని నాలుగున్నర సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంటూ తల్లిదండ్రులు లేని అనాథలుగా ఎదురుచూస్తుంటే.. వరంగల్‌ తూర్పు టికెట్‌ ఇవ్వకుండా  కేసీఆర్‌ చేసిన పుణ్యం వలన పరకాల నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచే అదృష్టం దక్కిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొండా సురేఖ అన్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ పరకాల ప్రజల ఆదరణ మరిచిపోయేవాళ్లం కాదన్నారు. వాస్తవానికి 2019లో జరగాల్సిన ఎన్నికలు తొమ్మిది నెలలకు ముందు రావడానికి కేసీఆర్‌లో ఓటమి భయమేనన్నారు. మళ్లీ పరకాలకు రావడంతో తల్లిగారింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు.

టీడీపీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిన చరిత్ర చల్లా ధర్మారెడ్డికే దక్కుతుందన్నారు. తన సొంత కాంట్రాక్ట్‌ పనుల కోసమే ఇష్టారాజ్యంగా రోడ్డు పనులకు టెండర్లు వేసి నాణ్యత లేని పనులతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ఇంట్లో కూర్చుండి మీసాలు తిప్పుతున్నానని పదేపదే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతున్నాడని.. వేలాది మంది ప్రజల మధ్య  తిప్పే ధైర్యం తనకు ఉందంటూ మీసాలు తిప్పాడు. దీంతో కార్యకర్తలంతా జిల్లా టైగర్‌ కొండా మురళి అంటూ నినాదాలు చేశారు. చల్లా ధర్మారెడ్డిని ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరకాల పురపాలక సంఘం చైర్మన్‌ మార్త రాజభద్రయ్య, కాంగ్రెస్‌ నాయకులు నలుబోల కిష్టయ్య, పసుల రమేష్, బీరం సుధాకర్‌రెడ్డి, కట్కూరి దేవేందర్‌రెడ్డి,  పుజారి సాంబయ్య, బొచ్చు భాస్కర్, రజాక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top