కోమటిబండలో సీఎం కేసీఆర్‌

KCR Visits Komatibanda And Gave Directions To Collectors - Sakshi

సాక్షి, సిద్దిపేట: వర్గల్‌ మండలంలోని సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగారాయపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ ఫలితాలను జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీభూములు ఎడారిలా ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయగా పునరుద్ధరణ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయని సీఎం తెలిపారు. ఇపుడు ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం కూడా పెరిగిందన్నారు. జ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని..రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు.

అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

పచ్చదనంతో కళకళలాడాలి..
అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండు గంటలపాటు మిషన్‌ భగీరథపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలు పైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని వివరించారు. 

హరితహారం, మిషన్‌ భగీరథ పథకాలపై అధికారులకు  దిశానిర్దేశం చేశారు. యావత్‌ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top