ఉత్తమ్ కుమార్ ఉన్నడు.. ఆయన పేరు ఉత్తమ్ కాదు.. ఉత్తర కుమారుడు. ఒట్టి ప్రగల్భాలే పలుకుతాడు. పనులు మొదలు కాకముందే ఆయనకి అవినీతి ఎక్కడి నుంచి కనిపిస్తందో అర్థమైతలేదు' అని సీఎం చంద్రశేఖర్ రావు విమర్శించారు.
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం పైలాన్ ఆవిష్కరణ, యాదాద్రి పవర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం నల్లగొండ పట్టణంలోని ఎన్వీ కాలేజీ గ్రౌడ్స్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కె. చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. వాటర్గ్రిడ్ పనుల్లో అవినీతి చోటుచేసుకుందన్న టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
'నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒకొక్కరు నాకంటే మూడు రెట్టు లావుగా, పొడవుగా ఉంటరు. వాళ్లలో ఎవరైనా జిల్లా కోసం ఏదైనా చేశారా?' అని ప్రశ్నించారు. ' ఇగ ఉత్తమ్ కుమార్ ఉన్నడు. ఆయన పేరు ఉత్తమ్ కాదు.. ఉత్తర కుమారుడు. ఒట్టి ప్రగల్భాలే పలుకుతాడు. పనులు మొదలు కాకముందే ఆయనకి అవినీతి ఎక్కడి నుంచి కనిపిస్తందో అర్థమైతలేదు' అని విమర్శించారు.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేదిశగా గతంలో ఎన్నికయిన నాయకులు కనీస ప్రయత్నం ప్రయత్నాలు చేయలేదని, టీఆర్ఎస్ మాత్రమే ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించేందుకు కంకణం కట్టుకుందన్నారు.