నేడుఆదిలాబాద్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

KCR Elections Campaign In Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ముందస్తు ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ఉపసంహరణల ఘట్టం గురువారంతో ముగుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రకటన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని భైంసాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రమే బహిరంగ సభలో పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ షురూ అయిన తరువాత తొలిసారిగా గురువారం టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌ పూర్వ జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని చుట్టబోతున్నారు.

ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, భైంసాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా నిలవగా, ఈసారి అనేక నియోజకవర్గాల్లో గట్టిపోటీ నెలకొందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగినట్టే కాంగ్రెస్‌ కూడా పకడ్బందీగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ముందుకుపోతోంది. ఈ నేపథ్యంలో గురువారం నాటి కేసీఆర్‌ పర్యటన, ఎన్నికల ప్రచార సభలు తమకు కలిసొస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు.

పశ్చిమ సభలపై తూర్పు జిల్లా ఆసక్తి..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల పరిధిలోని ఆదిలాబాద్‌ మినహా నాలుగు నియోజకర్గాలలో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగే ఈ సభలకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో సభ లేకపోయినా, మంత్రి జోగు రామన్న ఇచ్చోడలో జరిగే సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్మల్, భైంసా సభల విజయవంతానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు.

ఖానాపూర్‌లో రేఖానాయక్‌ తరుపున పార్టీ నేతలు సముద్రాల వేణుగోపాలచారి, తదితరులు వ్యూహరచన చేస్తున్నారు. పశ్చిమ జిల్లాలో జరిగే ప్రచార సభలపై తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నేతలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఆదిలాబాద్‌ పూర్వ జిల్లాలో సీఎం సాగించే ప్రచారం పది నియోజకవర్గాలకు ఊపిరి పోస్తుందని వారు భావిస్తున్నారు. రెండో విడత సీఎం ప్రచార సభల్లో మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచారం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో కేసీఆర్‌ ప్రచార సభలను ఘనంగా నిర్వహించాలని మిగతా ప్రాంతాల అభ్యర్థులు ఆశిస్తున్నారు.

కేసీఆర్‌ సభల ద్వారా కాంగ్రెస్‌ దూకుడుకు కళ్లెం..
ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న తొమ్మిది చోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు గట్టిపోటీ నెలకొంది. పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థులు ‘నువ్వా–నేనా’ అనే స్థాయిలోనే ఢీకొడుతున్నారు. నిర్మల్‌లో మంత్రి ఐకే రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పోటీ పడుతుండగా, ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నను జిల్లాలో కాంగ్రెస్‌ ఏకైక మహిళా అభ్యర్థి గండ్రత్‌ సుజాత ఢీకొంటున్నారు. బోథ్‌లో రాథోడ్‌ బాపూరావు, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో రేఖానాయక్‌లను కాంగ్రెస్‌ అభ్యర్థులు భయపెడుతున్నారు. తూర్పు ప్రాంతంలో మంచిర్యాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎన్‌.దివాకర్‌రావుతో తలపడుతుండగా, ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది.

చెన్నూరులో బాల్క సుమన్‌కు పోటీగా కాంగ్రెస్‌ గ్రూప్‌–1 మాజీ అధికారి బి.వెంకటేష్‌నేతను రంగంలో దింపడంతో పోటీ రసవత్తరంగా మారింది. సిర్పూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పాల్వాయి హరీష్‌బాబు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఢీకొంటున్నారు. హరీష్‌బాబుకు వస్తున్న ఆదరణ కోనప్ప శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి కూడా ఆదివాసీ గిరిజనులకు ఇచ్చే హామీల కోసం ముఖ్యమంత్రి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నాలుగు నియోజకవర్గాల్లో చేసే ప్రసంగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఇచ్చే హామీలు, చేసే ప్రసంగం కాంగ్రెస్‌కు కళ్లెం వస్తుందని భావిస్తున్నారు.

అనుకూలమైన హామీ కోసం ఆదివాసీల ఆశ..
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏడాదిన్నర కాలంగా ఆదివాసీ ఉద్యమం వివిధ రూపాల్లో బహిర్గతమవుతూనే ఉంది. ఒక వర్గానికి కల్పిస్తున్న ఎస్‌టీ రిజర్వేషన్లను తొలగించి, ఏజెన్సీలోని ఆ వర్గం ఉద్యోగుల స్థానంలో ఆదివాసీలకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివాసీ ఉద్యమానికి నాయకత్వం వహించిన సోయం బాపూరావు, ఆత్రం సక్కు ఇద్దరూ కాంగ్రెస్‌ అభ్యర్థులుగానే పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆదివాసీ ఓట్లే కీలకం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి అనుకూలమైన హామీ ఏమైనా ఇస్తారేమోనన్న ఆశతో ఆయా నియోజకవర్గ అభ్యర్థులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top