ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు

KCR Campaigning  21 At Medak - Sakshi

టీఆర్‌ఎస్‌తోనే  అభివృద్ధి పరంపర 

ప్రజల ఆకాంక్ష  మేరకు అభివృద్ధి చేశాం

ఇంటికొకరు  వచ్చి  కేసీఆర్‌ను ఆశీర్వదించండి

కేసీఆర్‌ సభాస్థలిను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ మున్సిపాలిటీ: తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 21న మెదక్‌లో జరుగనున్న అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం మెదక్‌ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  దశాబ్దాలుగా పరిష్కారం కాని మెదక్‌ జిల్లా కేంద్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైందన్నారు. రైల్వేలైన్‌ పనులు, తాగు, సాగునీరు, ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, ఆధునీకరణ పనులు శాశ్వతంగా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జరిగాయన్నారు. అలాగే రోడ్డు విస్తరణ, రైతు బజార్‌ ఏర్పాటు, పాపన్నపేటలో మార్కెట్‌ యార్డు మంజూరు చేశామన్నారు.

ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు ఇంటికొకరు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా, వృద్ధాప్య, వితంతు, బీడీ కార్మికులు, వికలాంగుల పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేశామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందారని గుర్తు చేశారు. ప్రతీ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ఏదొరకమైన మేలు చేశామన్నారు.

మెదక్‌ ఏరియా ఆస్పత్రిలో 300 పడకలు ఏర్పాటు, డయాలసిస్, ఐసీయూలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో కాళేశ్వరం ద్వారా సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్‌ రాగి అశోక్, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అకిరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు చింతల నర్సింలు, గంగాధర్, జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top