కరీంనగర్‌లో ఐటీ పార్క్ | karimnagar IT park | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ఐటీ పార్క్

Dec 6 2014 2:38 AM | Updated on Sep 27 2018 4:02 PM

కరీంనగర్‌లో త్వరలోనే ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

సిరిసిల్ల: కరీంనగర్‌లో త్వరలోనే ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఐటీ పార్కు ఏర్పాటుపై ఇప్పటికే రెండు కంపెనీలతో మాట్లాడినట్లు తెలిపారు. సిరిసిల్లలో శుక్రవారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో స్మార్ట్ పోలీస్ టౌన్ (ఎస్‌పీటీ) ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోనే తొలిసారిగా సిరిసిల్లలో స్మార్ట్ పోలీస్ టౌన్‌ను ఎస్పీ శివకుమార్‌తో కలిసి ప్రారంభించారు.
 
 ఇందులో భాగంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు, మొబైల్ ఫోన్ నుంచి వాట్సప్‌లోనూ ఫిర్యాదు చేసే విధంగా ఁఈ-స్వీకార్*ను, పోలీస్ కమ్యూనిటీ రేడియో(ఎఫ్‌ఎం)ను ప్రారంభించారు. 44 సీసీ కెమెరాలతో పట్టణంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు 150 సీసీ సామర్థ్యంతో కూడిన బైక్‌లను పోలీసులకు సమకూర్చారు. పోలీసుల పెట్రోలింగ్ విధానాన్ని ఆధునికీకరించేందుకు ఁఈ-రక్ష* విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. జిల్లాలోని నేరరహిత పల్లెలను గుర్తించి ఆ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రూ.105 కోట్లతో సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రహదారులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
 
  పంచాయతీ రాజ్ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి రూ.17 కోట్లు కేటాయించామన్నారు. సిరిసిల్ల సెస్ పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ పంపిణీతో పాటు ఉత్పత్తిని సెస్ సంస్థ చేపడుతుందని, అందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిరిసిల్లలో పవర్‌లూమ్ కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీకి రూ.5.65 కోట్లు కేటాయించామని, 1325 మంది కార్మికులకు రుణవిముక్తి లభిస్తుందన్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.2.75 కోట్లు కేటాయించామని, తొలి విడతగా రూ.కోటి చెక్‌ను అందించామని వివరించారు.
 
 సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా ప్రకటించేందుకు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసినట్లు మంత్రి వెల్లడించారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు మరమగ్గాల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏడువేల మగ్గాల ఆధునికీకరణకు ఆసాములు ముందుకొచ్చారని మంత్రి స్పష్టం చేశారు. సిరిసిల్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేశామన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశామని  తెలిపారు. సిరిసిల్లలో మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు అవసరమైన భూసేకరణ చేస్తున్నామన్నారు. సిరిసిల్లలో రోడ్లును విస్తరిస్తామని అందుకు అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వి.శివకుమార్, ఏఎస్పీ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ దామెర నర్సయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, జెడ్పీటీసీలు పుర్మాని మంజుల, తోట ఆగయ్య, కౌన్సిలర్లు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
 
 శంకుస్థాపనులు.. ప్రారంభోత్సవాలు
 సిరిసిల్లలో మంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.70లక్షలతో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ భవనానికి శంకుస్థాపన చేశారు. బైపాస్ రోడ్డులో పది గుంటల్లో భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ.30 లక్షలతో నిర్మించే ఐసీడీఎస్ ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. సాయినగర్ కార్గిల్ లేక్ వద్ద ఎలక్ట్రానిక్ చెక్‌పోస్ట్‌ను ప్రారంభించి, శుద్ధజల కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement