ప్రభ కోల్పోతున్న జెడ్పీలు 

JDPs are gradually losing their appeal - Sakshi

కేంద్ర నిధులు నేరుగాపంచాయతీలకే 

14వ ఆర్థికసంఘం నిధులతో పంచాయతీలే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లు (జెడ్పీలు) క్రమక్రమంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ప్రస్తుతం జెడ్పీలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇవి గత కాలపు వైభవానికి చిహ్నాలుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోవడానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు 14వ ఆర్థికసంఘం సిఫార్సులు ప్రధాన కారణం కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు తగ్గిపోవడం మరో కారణం.

2015 సంవత్సరం నుంచి 14వ ఆర్థికసంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక నేరుగా గ్రామపంచాయతీలకే అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నారు. దీంతో వివిధ పథకాల కింద జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా విడుదలయ్యే నిధులు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 మేలో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీల సంఖ్య 9 ఉండగా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు (తాజాగా ప్రకటించిన రెండు జిల్లాలు కలిపి), మండలాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు పెరగబోతోంది. 

అక్కడ సాధ్యమేనా? 
ఈ ఏడాది జూలైతో పాత జిల్లాపరిషత్‌ల కాలపరిమితి ముగిశాక, కొత్త జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మేడ్చల్‌ జిల్లా పరిధిలో 5, వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో 7 మండలాలు, గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాల్లోని మండలాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపై స్పష్టత రాలేదు.

 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానికసంస్థలకు అధికారాలను కట్టబెట్టడంలో భాగంగా సాధారణంగా జిల్లాగా ప్రకటించిన ప్రాంతాన్నే జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీ)గా పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా మార్పులు,చేర్పులు చేపడుతుందా? లేక ఇప్పటికే ఏర్పాటు చేసిన 31 జిల్లాలతోపాటుగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలతో కలసి మొత్తం 32 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 

జిల్లాల పునర్విభజన ప్రకారమేనా? 
జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారమే కొత్త జిల్లా,మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు అవుతాయని కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో కూడా స్పష్టం చేసినందున తదనుగుణంగానే కొత్త జిల్లాలు, మండలాలు ప్రత్యేక యూనిట్లుగా మారతాయి. 1974 తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారం కూడా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలు,కొత్త మండలాల ప్రాతిపదికన మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడతాయి. గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజాగా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top