అవగాహన లేకుంటే..చిక్కులే!

Indians Should Have Knowledge On Gulf Acts - Sakshi

 గల్ఫ్‌లో ర్యాలీలు, నిరసనలు నిషేధం 

ఏ కార్యక్రమానికైనా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి 

సాక్షి, కరీంనగర్‌: వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనపై గత శుక్రవారం కువైట్‌లో  ప్లకార్డులు పట్టుకొని  నిరసన తెలిపిన 24మంది ప్రవాసాంధ్రులను కువైట్‌ నిఘా బృందాలు అరెస్టు చేశాయి. నిరసన ప్రదర్శన  ఉద్దేశం మంచిదే అయినా ఆ దేశ చట్టాలకు విరుద్ధం కాబట్టి నిరసనకారులు ఇబ్బందుల్లో పడ్డారు. భారత దేశంలో  పౌరులు తమ హక్కుల కోసం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్లడానికి  బంద్‌లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయడం సర్వసాధారణం.

భారత్‌లో పుట్టిపెరిగిన వారు ఉద్యోగ రీత్యా గల్ఫ్‌ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వలన చిక్కుల్లో పడుతున్నారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే  ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ నుంచి రాచరిక పాలన, ముస్లిం షరియా చట్టాలు అమలులో ఉండే అరబ్‌ గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి పరిస్థితులలో ఇమడలేక మానసిక సంఘర్షణ పడుతుంటారు. కొంత కాలం తర్వాత అలవాటుపడి సర్దుకుపోతుంటారు. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్‌ దేశాలలో అక్కడి చట్టాల ప్రకారం సమ్మెలు, నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధం. గల్ఫ్‌లో  సభలు, సమావేశాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు తదితర ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి.  

సోషల్‌ మీడియా ప్రభావం
గల్ఫ్‌లో ఉండే చాలా మంది ప్రవాసులు స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులతో వాయిస్‌ కాల్, వీడియో కాల్‌  మాట్లాడటానికి స్మార్ట్‌ ఫోన్లలో ఐఎంఓ (ఈమో), బోటిం, వాట్సాప్‌ లాంటి యాప్‌లను వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఫేస్‌బుక్, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. స్వదేశంలో జరిగే సంఘటనలు, సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై తమ సోషల్‌ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తున్నారు. రకరకాల విషయాలపై  ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌ గ్రూపులలో వాగ్యుద్ధాలు, తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతుంటాయి. అర్థవంతమైన, విషయాత్మక చర్చలు, విలువైన సమాచార మార్పిడి కూడా జరుగుతున్నది. వార్తలు, విశేషాల అప్‌డేట్స్‌ కోసం ప్రవాసులు  సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. 
– మంద భీంరెడ్డి, ప్రవాసీ మిత్ర.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు
మంచి కోసమైనా సరే.. గల్ఫ్‌ దేశ నిబంధనలకు విరుద్ధంగా పొతే జైలుపాలవుతాం. ఏ కార్యక్రమం చేయాలన్నా మన దేశానికి చెందిన సీనియర్ల సలహా తీసుకుని నిర్వహించాలి. ఆ దేశ ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయకూడదు. గల్ఫ్‌లో చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుంటపోతది. వరంగల్‌ ఘటనపై ఆవేదనతో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. వారిని విడిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.  
– గోలి, శ్రీనివాస్,ఖతార్‌ 

వినతి పత్రం రూపంలో పంపాలి   
గల్ఫ్‌ దేశాలకు వలస వచ్చిన మనం ఇక్కడ అతిథులం మాత్రమే. ఈ దేశాల పౌరులం కాదు. మన సమస్యలు గానీ, అభిప్రాయాలు గానీ ఏమైనా వ్యక్తం చేయాలన్నా వినతి పత్రం రూపంలో ఇండియన్‌ ఎంబసీకి పంపాలి. మన సమస్యలపై భారత ప్రభుత్వానికి, ఆయా శాఖలకు ఉత్తరాలు రాయవచ్చు. కానీ, గల్ఫ్‌లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడం నిషేధం. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. 
– షహీన్‌ సయ్యద్, సామాజిక కార్యకర్త, కువైట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top