నిమిషాల్లో నిగ్గు తేలుస్తుంది

Immediate results on the quality of materials - Sakshi

పదార్థాల నాణ్యతపై అప్పటికప్పుడే ఫలితాలు 

రాష్ట్రంలో అందుబాటులోకి మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌

సాక్షి, హైదరాబాద్‌: పాల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్ల నుంచి వంటల్లో వాడే మసాలాలు, నూనెల వరకు...కిరాణా కొట్లో కొనే సరుకుల నుంచి కర్రీ పాయింట్లలో విక్రయించే కూరలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వడ్డించే వంటకాల వరకు జరుగుతున్న కల్తీలకు ఇకపై నిమిషాల వ్యవధిలోనే అడ్డుకట్ట పడనుంది. ఇప్పటివరకు ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి వాటి నాణ్యతను తేల్చేందుకు ఎక్కువ కాలం పడుతుండగా ఇక నుంచి ఫిర్యాదులు అందిన చోటే పరీక్షలు జరగనున్నాయి. ఆహార పదార్థాల నాణ్యతపై అక్కడికక్కడే ఫలితాలు వెలువడనున్నాయి.

దేశవ్యాప్తంగా ఆహార కల్తీని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌’రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) కార్యాలయ ఆవరణలో ఈ వాహనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి, శాసన మండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్, ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ తదితరులు ప్రారంభించారు. రూ. 50 లక్షలతో రూపొందిన ఈ వాహనంలో కల్తీలను నియంత్రించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహన నిర్వహణ, ఇంధన ఖర్చుల కోసం ఏటా రూ. 5 లక్షలను సైతం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనుంది. ఇకపై ఈ వ్యాన్‌ నేరుగా హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫిర్యాదులు చేసే వినియోగదారుల ఇళ్ల వద్దకు వచ్చి మరీ పరీక్షలు చేయనుంది. చాలా రకాల నమూనాలపై కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడించనుంది. ఆహార ఉత్పత్తుల వ్యాపారం ఎక్కువగా జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ వాహనం సేవలను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గ్రామాల్లో ప్రత్యేక అవగాహన... 
మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ కేవలం ఆహార పరీక్షలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ సంచరించనుంది. ఆహారం, తాగునీరు కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు, స్వీయ శుభ్రతలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించనుంది. వాహనంలోని టీవీ ద్వారా కల్తీకి సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. వాహనంలో డ్రైవర్, ఫుడ్‌ అనలిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, అటెండర్‌ ఉంటారు. నెలవారీ టార్గెట్‌ ప్రకారం ఈ వాహనం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పర్యటిస్తుంది. 

వెంటనే ఫలితాలు ప్రకటిస్తాం 
కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం 54 రకాల పదార్థాలపై పరీక్షలు నిర్వహిస్తాం. వెంటనే ఫలితాలను కూడా ప్రకటిస్తాం. ఈ వ్యాన్‌ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది.    
    – డాక్టర్‌ కె.సావిత్రి, చీఫ్‌ ఫుడ్‌ ఎనలిస్ట్‌ (ఐపీఎం)

ఇంట్లో వాటినీ పరీక్షించుకోవచ్చు 
ఇళ్లలో పాల నాణ్యతపై సందేహం ఉన్న వారు నేరుగా ఈ వ్యాన్‌ వద్దకు వచ్చి పాలను పరీక్షించుకోవచ్చు. 
– బి.విజయలక్ష్మి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వైరాలజీ 

స్పాట్‌కు వెళ్తాం సాల్వ్‌ చేస్తాం 
మాకు ఫిర్యాదు అందినా..అందకున్నా మేం స్పాట్‌కు వెళ్తాం. పాలు, ఉప్పు, పప్పు, కూరలు, అన్నం, నూనె వంటి వాటిపై తక్షణం పరీక్షలు నిర్వహిస్తాం. అక్కడికక్కడే రిజల్ట్‌ని ప్రకటిస్తాం. 
    – బి.శారద, ఫుడ్‌ ఎనలిస్ట్‌ 

వీటిపై పరీక్షలు..
పాలు, నెయ్యి, పన్నీరు, నూనె, కారం, కారాబూందీ, ఆలూ చిప్స్, తీపిపదార్థాలు, ఉప్పు, మసాలాలతో కూడిన నిల్వ పదార్థాలు, అన్ని రకాల పచ్చళ్లను పరీక్షించి మొబైల్‌ ల్యాబ్‌ అప్పటికప్పుడే ఫలితాలను వెల్లడిస్తుంది. ఆహార పదార్థాల్లో నిషేధిత రంగులుంటే వెంటనే పసిగడుతుంది. సందేహాలు ఉన్న కొన్ని నమూనాలను మాత్రం ఐపీఎంకు తరలించి పరీక్షిస్తారు. అలాగే చిన్న దుకాణాలు, బేకరీల్లో విక్రయించే నీళ్ల ప్యాకెట్లు, బాటిళ్లు, పాల ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా ఉందో లేదో పరీక్షించేందుకు మొబైల్‌ ల్యాబ్‌లో 24 గంటల సమయం పట్టనుంది. 

ఫోన్‌ కొట్టు భరతం పట్టు..
ఆహార కల్తీలపై 9100107309 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిబ్బంది వాహనంతో వచ్చి నమూనాలు సేకరించి అక్కడికక్కడే ఫలితాలు ప్రకటిస్తారు. కల్తీ నిజమని తేలితే కల్తీదారుడిని జైలుకు పంపుతారు. 

వ్యాన్‌లో ఉండేవి ఇవే... 
వ్యాన్‌లో పరీక్షలు నిర్వహించడానికి ‘మిల్క్‌ స్క్రీన్, పీహెచ్‌ మీటర్‌ (నీరు, ఆయిల్‌ల అనాలసిస్‌ కోసం), న్యూమరికల్‌ బ్యాలెన్స్‌ పరికరం, కెమికల్‌ స్టాండ్, బ్యూరెట్, బ్యూరెట్‌ స్టాండ్, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్, ల్యాడర్, సెటప్‌ రేడియో, యాంప్లిఫ్లయర్, వర్క్‌ బెంచ్, జనరేటర్, రిఫ్రిజిరేటర్, గ్యాస్‌ సిలిండర్, వాటర్‌ ట్యాంక్, సింక్, ఫైర్‌ ఎగ్జాస్ట్, కంప్యూటర్, ప్రింటర్, టీవీ ఉన్నాయి. 

త్వరలో మరో వాహనం: లక్ష్మారెడ్డి  
ఆహార కల్తీని నియంత్రించేందుకు తొలి దశలో రెండు వాహనాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రస్తుతానికి ఒక వాహనాన్ని పంపారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే మరో వాహనం వస్తుందని చెప్పారు. ఆహార కల్తీ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు, వ్యాపారులు కల్తీలను అరికట్టడంలో నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. ఆహార కల్తీ చట్టాన్ని మరింత కఠినంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. పటిష్టమైన చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top