కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లోని ఇరవై పరిశ్రమలకు బుధవారం కరెంట్ కట్ చేశారు.
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లోని ఇరవై పరిశ్రమలకు బుధవారం కరెంట్ కట్ చేశారు. విద్యుత్ బకాయిలున్నాయని సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడంతో పారిశ్రామిక వేత్తలు దిక్కుతోచకున్నారు. సిరిసిల్లలోని వస్త్రపరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం విద్యుత్ రాయితీని అందిస్తుంది.
అయితే టెక్స్‌టైల్ పార్క్‌లోని ఆధునిక పరిశ్రమలకు మాత్రం ఎఫ్‌ఎస్‌ఏ విధిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పార్క్‌లోని పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌కు ఎఫ్‌ఎస్‌ఏతో కలిపి విద్యుత్ చార్జి రూ. 8.13పైసలు పడుతోంది. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో రాయితీ అమలు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి.
దీంతో బుధవారం అధికారులు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇటీవల యజమానులు సమ్మెకు దిగినప్పుడు సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ తాజాగా సెస్ అధికారులు కరెంట్ తొలగించడంతో ఆ కార్ఖానాల్లో వస్త్రోత్పత్తి నిలిచి పోయింది.