గొంతులో గరగర!

Hypothyroid Cases Files in hyderabad - Sakshi

గ్రేటర్‌లో 8.88 శాతం మందిలో థైరాయిడ్‌ సమస్య

బాధితుల్లో 70 శాతం మహిళలు..

వాతావరణ కాలుష్యం, హార్మోన్లలో సమతుల్యత లోపం వల్లే..

అయోడిన్‌ లోపం వల్ల కాకుండా వాహన, పారిశ్రామిక కాలుష్యం..హార్మోన్లలో లోపించిన సమతుల్యత వల్ల నేడుహైదరాబాద్‌ వంటి మెట్రోనగరాల్లోథైరాయిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మందిథైరాయిడ్‌తో బాధ పడుతుంటే, అత్యధికబాధితులతో కోల్‌కతా తొలిస్థానంలో,హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచాయి.

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా కన్పించే హైపోథైరాయిడిజం కేసులు నేడు మెట్రోనగరాల్లోనూ జడలు విప్పుతోంది. పౌష్టికాహారం, అయోడిన్‌లోపం...వాతావరణ కాలుష్యం వల్ల గ్రేటర్‌లో నేడు అనేక మంది థైరాయిడ్‌ బారిన పడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోం ది. ఇప్పటి వరకు కేవలం మధుమేహ, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ నగరం తాజాగా హైపోథైరాయిడిజంలోనూ ఇతర ప్రాంతాల తో పోటీపడుతోంది. ఇండియన్‌ థైరాయిడ్‌ ఎపిడమిలాజీ సంస్థ ఇటీవల ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, గోవా తదితర ప్రాంతా ల్లో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసి థైరాయిడ్‌తో బాధపడుతున్న వారి వివరాలను సేకరించింది. కొల్‌కటలో 21.6 శాతం, ఢిల్లీలో 11.07 శాతం, అహ్మదా బాద్‌లో 10.6 శాతం, ముంబైలో 9.6 శాతం ఉండగా, హైదరాబాద్‌లో 8.88 శాతం మంది థైరాయిడ్‌ బాధితులు ఉన్నట్లు గుర్తించింది. బాధితుల్లో 70 శా తం మహిళలు ఉంటే..30 శాతం పురుషులు ఉన్నట్లు నిర్ధారించింది. హార్మోన్లలో సమతుల్యత లోపానికి తోడు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన, ప్రారిశ్రామిక కాలుష్యం, పని ఒత్తిడి, మారిన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమని గుర్తించింది. 

థైరాయిడ్‌ అంటే...
థైరాయిడ్‌ అనేది రెండు రకాలు. ఒకటి హైపర్‌ థైరాయిడిజం కాగా, మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్‌ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉప యోగపడటంతో పాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీర ఉష్ణో గ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. అయితే ఈ గ్రంథి సరిగా విధులు నిర్వహించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్‌ థైరాయిడిజమ్‌కు కార ణమవుతోంది. ప్రస్తుతం నగరంలో హైపోథైరాయిడిజం బాధితులు ఉక్కువ ఉన్నారు. ఉన్నట్లుండి బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారిపోవడం, విపరీతమైన అలసట, మహిళలల్లో రుతుక్రమం తప్పడం, సంతానలేమి వంటివి ఈ హైపోథైరా యిడ్‌ లక్షణాలైతే...., బరువు తగగ్గడం, విపరీతమైన చమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒకటే టెన్షన్, చేతులు వణకడం వంటి లక్షణాలు కన్పిస్తే  హైపర్‌ థైరాయిడ్‌గా భావిస్తారు.  

కాలుష్యం కూడాఓ కారణం  
అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో థైరాయిడ్‌ బారిన పడే వారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది తమ ఆహారంలో అయోడిన్‌ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్‌ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ రకరకాల వ్యాధులకు కారణం అవుతన్న బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడాల్సిన రోగనిరోధక శక్తి దానికి విరుద్ధంగా అంతర్గత అవయవాలతో పోరాడుతోంది. దీనికి తోడు వాహన, పారిశ్రామిక కాలుష్యం కూడా దీనికి కారణం అవుతోంది. ఆసక్తికర అంశమేమంటే తమకు థైరాయిడ్‌ ఉన్నట్లు బాధితుల్లో సగం మందికి నేటికీ తెలియదు. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంత వరకు కాపాడుకోవచ్చు. లేదంటే ఆరోగ్యానికి నష్టం.  – డాక్టర్‌ శివరాజు,కన్సల్టెంట్‌ ఫిజిషియన్, కిమ్స్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top