పెట్టీ కేసులకు చెక్‌ పెట్టేందుకు...

Hyderabad Police Lanched New E-Petty Case App - Sakshi

ఈ–పెట్టీ కేసెస్‌ యాప్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో చిన్న చిన్న తగాదాలపై నమోదయ్యే ‘పెట్టీ’కేసులకు చెక్‌పెట్టేలా పోలీస్‌శాఖ ఒక యాప్‌ను రూపొందించింది. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ‘ఈ–పెట్టీ కేసెస్‌’యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచి, పర్యవేక్షించడం వల్ల భవిష్యత్‌లో తీవ్రత కల్గిన నేరాలకు పాల్పడకుండా నియంత్రించేందుకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పబ్లిక్‌ న్యూసెన్స్, బహిరంగ మద్యపానం, రాష్‌ డ్రైవింగ్, పేకాట వంటి పెట్టీ కేసుల్లో సంఘటనా స్థలం నుంచే చార్జిషీట్‌ దాఖలు చే సేందుకు యాప్‌ దోహదపడుతుందని చెప్పా రు. గతంలో ఈ యాప్‌ను హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌లో అమలు చేయగా పెట్టీ కేసుల సమస్య 35 శాతం తగ్గిందన్నారు. యాప్‌ను ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాల్సి ఉందని, ఇందులో భాగంగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లోని అధికారులకు శిక్షణ ఇచ్చి త్వరలోనే అక్కడ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.

యాప్‌ ద్వారా పోలీసులు చేసేవి... 

  • ఐపీసీ సెక్షన్లు, సిటీ పోలీస్‌ యాక్ట్, గేమింగ్‌ చట్టం, సీఓటీఏపీ–2003 యాక్ట్, మోటార్‌ వెహికల్‌ యాక్ట్, టౌన్‌ న్యూసెన్స్‌ యాక్ట్‌ కింద కేసుల నమోదు. 
  • ట్యాబ్‌ల ద్వారా ఘటనాస్థలిలో ఫొటోలు, వీడియోలు, వస్తువులు గుర్తించి అప్‌లోడ్‌.  
  • నేరస్తుడి పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్, ఆ ప్రాంత జియోట్యాగ్‌ను యాప్‌తో అనుసంధానించడం. 
  • సాక్షులను విచారించి ఘటనా స్థలి నుంచే వారి వాంగ్మూలం సేకరణ. 
  • కేసు నమోదుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రింట్‌ నిందితుడికి అప్పగింత. 
  • ఆటోమెటిక్‌ విధానం ద్వారా అప్‌లోడ్‌ చేసిన అన్ని వివరాలతో కూడిన చార్జిషీట్‌ ఈ–ఫైల్‌ రూపంలో తయారీ. 
  • మరుసటి రోజున నిందితుడు తాను స్వీకరించిన కేసు వివరాల రశీదుతో కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.

యాప్‌ వల్ల ప్రయోజనాలు...

  • అవసరం లేకున్నా పెట్టీ కేసులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడవు. 
  • పబ్లిక్‌ న్యూసెన్స్‌కు సంబంధించి హాట్‌స్పాట్లను గుర్తించడం సులభతరమవుతుంది.  
  • పెట్టీ కేసులకు ప్రధాన కారణాలను గుర్తించడం, మరింత తీవ్ర సంఘటనలు జరగకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. 
  • పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెరగడంతో శాంతిభద్రతల పరిరక్షణ సులభమవుతుంది. 

నేనే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తుంటా... 
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలపై డీజీపీ మహేందర్‌రెడ్డిని మీడియా ప్రశ్నించగా తానే మూడు రోజులకోసారి 100 నంబర్‌కు ఫోన్‌ చేసి పరీక్షిస్తుంటానని డీజీపీ చెప్పారు. తాను చేసిన సందర్భాల్లో 5 నిమిషాల్లోపే ఘటనా స్థలికి పోలీసులు చేరుకుంటున్నారని వివరించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయం 5 నిమిషాల్లోపే ఉంటోందని, అదే విధంగా రాచకొండ, సైబరాబాద్‌లో 10 నిమిషాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఈ–చలాన్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు కూడా పాయింట్ల పద్ధతిని అమలు చేçస్తామన్నారు. యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు డీజీపీలు గోవింద్‌సింగ్, రవిగుప్తా, జితేందర్, రాజీవ్‌ రతన్, ఐజీలు సౌమ్యా మిశ్రా, సజ్జనార్, మహేశ్‌ భగవత్, నాగిరెడ్డి, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top