హద్దు మీరొద్దు!

Hyderabad City Ready For New Year Celebrations - Sakshi

 న్యూఇయర్‌ వేడుకలపై డేగకన్ను  

హంగామా సృష్టిస్తే కఠిన చర్యలు  

అనుమానిత డీజేలపై ‘మఫ్టీ’ నిఘా

‘స్టాగ్‌ గ్యాంగ్స్‌’ కదలికలపై ప్రత్యేక టీమ్స్‌  

 నగరం నయా సాల్‌ వేడుకలకు సిద్ధమవుతోంది. పబ్‌లు, క్లబ్‌లు, కన్వెన్షన్‌ సెంటర్స్, స్టార్‌ హోటల్స్‌.. ఇలా ఒకటేమిటి మరెన్నో వేదికలు ‘ఆర్‌ యూ రెడీ’ అంటూ ఆహ్వానిస్తున్నాయి. ప్యాకేజీలు, ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి.మరి డీజే హోరులో డ్యాన్స్‌ జోరుతో ఎంజాయ్‌ చేసేందుకుమీరూ సిద్ధమా? ఇదిగో ఆ ఈవెంట్స్‌ సమాచారం.  

సాక్షి, సిటీబ్యూరో: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా... మాదకద్రవ్యాల విక్రయం, వినియోగానికి చెక్‌ చెప్పేందుకు  సిటీ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. సాధారణంగా సిటీలోని పబ్స్‌ కపుల్‌ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యువకులు గుంపులుగా వచ్చి పబ్స్‌ వద్ద హల్‌చల్‌ చేసిన సందర్భాలున్నాయి. ‘స్టాగ్‌ గ్యాంగ్స్‌’గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్‌ తయారు చేశారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. జోష్‌లో భాగంగా విచ్చలవిడిగా హారన్లు మోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే హాంకింగ్‌ గ్యాంగ్స్‌తో పాటు కార్ల టాప్స్, బాయినెట్స్‌పై కూర్చుని హంగామా చేస్తూ ప్రయాణించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

న్యూఇయర్‌ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్‌ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని వెస్ట్‌జోన్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. సిటీలో చిక్కిన డ్రగ్స్‌ విక్రేతలు, వినియోగదారుల్లో ఈ జోన్‌లో పట్టుబడిన వారే ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్‌) అరెస్టయిన, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని కట్టడి చేయాలని నిర్ణయించారు. వీరందరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ద్వారా చెక్‌ చెప్పేందుకు స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. మరోపక్క గతంలో చిక్కిన డ్రగ్స్‌ ముఠాలు వెల్లడించిన వివరాలు, పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని పబ్స్‌లోని డీజేలు కూడా పెడ్లర్స్‌గా మారి వ్యవహారాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై నిఘా వేయడానికి మఫ్టీ బృందాలు విధుల్లో ఉంటాయి. వీటితో పాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్‌ కంట్రోలింగ్‌కు ప్రత్యేక బృందాలను మోహరిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఈ బృందాలన్నీ పని చేస్తుంటాయి. పశ్చిమ మండలంతో పాటు నగర వ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా కార్యక్రమాలు, వెన్యూల వద్ద ఉండే బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.  

50 బృందాలు...  
నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మెషిన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. ఇది వీఐపీ జోన్‌ మాత్రమే కాదు... ‘ఖరీదైన’ కుర్రకారు జోన్‌ కూడా. వీరి అత్యుత్సాహం నేపథ్యంలో పలు వేడుకలు సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని అదనపు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్‌ పార్క్‌ రోడ్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10, సికింద్రాబాద్, మెహిదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్‌ డ్రైవింగ్‌ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధించనున్నారు. బయట ప్రాంతాలకు వెళ్లి పార్టీల్లో పాల్గొన్న వారు సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.  

చిరాన్‌పోర్ట్‌ క్లబ్‌
బేగంపేట మానస సరోవర్‌ హోటల్‌ సమీపంలోని చిరాన్‌పోర్ట్‌ క్లబ్‌లో ‘2కే 19 న్యూఇయర్‌ ఈవ్‌’ పేరుతో  సంబరాలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 31న రాత్రి 8గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. బాలీవుడ్‌ సింగర్‌ తరబ్‌ఖాన్, రాజ్‌కుమార్, షరీఫ్‌ స్టాండప్‌ కామెడీ, డ్యాన్‌ షోలు ప్రత్యేక ఆకర్షణ. 

హార్ట్‌ కప్‌ కాఫీ
బేగంపేటలోని హార్ట్‌ కప్‌ కాఫీ నిర్వాహకులు ముందుగానే న్యూఇయర్‌ వేడుకలకు సిద్ధమయ్యారు. శనివారం రాత్రి 8గంటల నుంచి ‘ప్రీ న్యూఇయర్‌ బాష్‌’ నిర్వహించనున్నారు. బ్రెజిల్‌ నుంచి లైవ్‌ షో ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలవనుంది. ఈ లైవ్‌లో అంతర్జాతీయ డీజేల ప్రదర్శనను ఆస్వాదించొచ్చు. ఇక డిసెంబర్‌ 31న రాత్రి 8గంటల నుంచి న్యూఇయర్‌ వేడుకలు ప్రారంభమవుతాయి. హిప్‌ హప్, బాలీవుడ్‌ మ్యూజిక్, నియాన్‌ థీమ్‌ లైట్స్, ఫైర్‌వర్క్స్‌ ప్రత్యేకతలు. 

హాకీ స్టేడియం
మహంకాళి రోడ్డులోని బేగంపేట హకీ స్టేడియం న్యూఇయర్‌ జోష్‌కు సిద్ధమైంది. లండన్‌కు చెందిన డీజే ఆండ్రాతో పాటు ఎంటీవీ ఫేమ్‌ డీజే సోనాలీ కత్యాల్‌ సంగీతంతో హోరెత్తించనున్నారు. ఫైర్‌వర్క్స్, ఈడీఎం మ్యూజిక్, గ్లారింగ్‌ స్టేజ్, లైటింగ్, సౌండ్‌ సెటప్‌ ఈ వేడుకల ప్రత్యేకత. 

తాజ్‌వివంతా
బేగంపేటలోని తాజ్‌వివంతా హోటల్‌లో న్యూఇయర్‌ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీటర్‌ మారియో మ్యూజిక్‌ మంత్రంతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వంటకాలను అందించనున్నారు. 

నోవాటెల్‌
మాదాపూర్‌లోని నొవాటెల్‌ హోటల్‌లో ఎన్‌వైఈ–2019 పేరుతో  వేడుకలు నిర్వహించనున్నారు. కోల్‌కతాకు చెందిన డీజే స్నియా, సిటీ డీజే వినీశ్‌లు మ్యూజిక్‌తో అలరించనున్నారు. కపుల్స్‌ టికెట్‌ రూ.7,999, పిల్లల(13–20ఏళ్లు)కు రూ.2,500, కిడ్స్‌ (12ఏళ్ల లోపు)కు రూ.1500. 

ట్రైడెంట్‌
మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో ‘ఫన్‌ ఎక్స్‌టెండెడ్‌–2018’ పేరుతో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించనున్నారు. డీజే, డైనింగ్, డిసర్ట్స్‌ ఉంటాయి. స్టాగ్‌ టికెట్‌ రూ.4,999, కపుల్‌ టికెట్‌ రూ.7,999.  

ఎన్‌–కన్వెన్షన్‌
మాదాపూర్‌ ఎన్‌–కన్వెన్షన్‌లో ‘బాంగ్‌ బాంగ్‌–2019’ పేరుతో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించనున్నారు. డైమండ్‌ స్టాగ్‌ టికెట్‌ రూ.2,999, డైమండ్‌ కపుల్‌ రూ.4,999, ప్లాటినమ్‌ స్టాగ్‌ రూ.4,999, ప్లాటినమ్‌ కపుల్‌ రూ.8,999.

షెరటాన్‌
గచ్చిబౌలి పైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని షెరటాన్‌ హోటల్‌లో ‘రింగ్‌ ఇన్‌ 2019 – ది నియోన్‌ వే’ పేరుతో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించనున్నారు. వివిధ కేటగిరీల్లో టికెట్లు ఉన్నాయి. స్టాగ్‌ (స్టే, స్టాండింగ్‌) రూ.3,999, కపుల్‌ రూ.6,999, స్టాగ్‌ స్టే రూ.11,049, కపుల్‌ స్టే రూ.13,049, స్టాగ్‌(వితౌట్‌ స్టే, సీటింగ్‌)రూ.4,999, కపుల్‌ (వితౌట్‌ స్టే, సీటింగ్‌)రూ.8,499. 

రాడిసన్‌
గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో ‘న్యూఇయర్‌ ఈవ్‌ రూప్‌ టాప్‌ పార్టీ’ పేరుతో వేడుకలు నిర్వహించనున్నారు. ఎంట్రీ ఫీజు రూ.4,000. డీజే, అన్‌ లిమిటెడ్‌ డ్రింక్స్, ఫుడ్‌ ఉంటుంది. కాక్‌టెయిల్స్, మాక్‌టెయిల్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇక్కడే ‘నషా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. డీజే లహర్, డీజే సి«ధ్‌ సంగీతంతో హోరెత్తించనున్నారు. ఫీమేల్‌ స్టాగ్‌ రూ.2,299, మేల్‌ స్టాగ్‌ రూ.2,299, కపుల్‌ రూ.4,999, మేల్‌ స్టాగ్‌ గ్రూప్‌ (ముగ్గురు) రూ.8,499, మేల్‌ స్టాగ్‌ గ్రూప్‌ (ఐదుగురు) రూ.12,999. 

ఎల్లా హోటల్‌
గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ‘అన్‌ మాస్కింగ్‌’ పేరుతో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించనున్నారు. స్టాగ్‌ టికెట్‌ రూ.3,499, కపుల్‌ రూ.5,999. డీజే హరీష్‌ ప్రత్యేక ఆకర్షణ. 

సంధ్య కన్వెన్షన్‌ సెంటర్‌
గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ‘న్యూఇయర్‌ ఈవ్‌ గుర్‌బాక్స్‌’ పేరుతో వేడుకలు నిర్వహించనున్నారు. సింగిల్‌ టికెట్‌ రూ.1,499, కపుల్‌ రూ.2,499, ఫ్యామిలీ రూ.3,333, గ్రూప్‌ పాస్‌ (ఐదుగురు) రూ.4,999. 

మరిన్ని...
మాదాపూర్‌లోని బుట్టా కన్వెన్షన్‌ సెంటర్, ది వెస్టిన్‌ హోటల్, ఇనార్బిట్‌ మాల్, హైటెక్స్‌ గ్రౌండ్, కావూరిహిల్స్‌లోని ఫుట్‌బాల్‌ డ్రైవ్‌ ఇన్, శిల్పకళావేదిక, అవాసా స్కై లాంజ్‌ బార్, హోటల్‌ ఐటీసీ, స్కై హై పబ్, బి–డబ్స్‌ పబ్‌లు, శివానీ ది రెస్టారెంట్, ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్, కొండాపూర్‌లోని సౌండ్‌ గార్డెస్‌ కేఫ్‌ తదితర ప్రాంతాల్లోనూ న్యూఇయర్‌ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top