ముసాయిదా వార్డుల జాబితాపై భారీగా అభ్యంతరాలు

Huge Objections To The List Of Draft Wards In Karimnagar - Sakshi

వార్డుల్లో ఓటర్ల కూర్పు, సరి హద్దుల పైనే ప్రధాన వ్యతిరేకత

కరీంనగర్‌లో అత్యధికంగా 164 అభ్యంతరాలు

సాక్షి, కరీంనగర్‌ : మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన వార్డుల జాబితాపై ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ నెల 3న ప్రకటించిన ముసాయిదా వార్డుల జాబితాపై సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఈ సందర్భంగా కరీంనగర్, రామగుండం మునిసిపల్‌ కార్పొరేషన్లతోపాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 14 మునిసిపాలిటీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు తమ అభ్యంతరాలను ఆయా మునిసిపల్‌ కమిషనర్లకు అందజేశాయి. ఈ అభ్యంతరాలను వారం రోజుల్లోగా పరిశీలించి, పరిష్కరించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఈ నెల 15లోగా కార్యక్రమం ముగించి 16న వార్డుల తుది జాబితాను తయారు చేసి, 17న ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తారు. ఒకవేళ అభ్యంతరాలను పరిష్కరించలేని పరిస్థితి ఉంటే అందుకు గల కారణాలతో పూర్తిస్థాయి నివేదికను కూడా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. 

కరీంనగర్‌లో అత్యధికంగా 164 అభ్యంతరాలు
కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 60 వార్డుల(డివిజన్లు) నుంచి అత్యధికంగా 164 అభ్యంతరాలు రావడం గమనార్హం. ఇందులో అభ్యంతరాలకు చివరిరోజైన సోమవారం ఒక్కరోజే 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా కిసాన్‌నగర్, అంబేద్కర్‌నగర్‌ వార్డులకు సంబంధించి ఏకంగా 50 అభ్యంతరాలు రాగా, కనీసం 30 వార్డుల రూపురేఖలు మార్చాలని పలువురు దరఖాస్తులు అందజేశారు. వార్డుల భౌగోళిక స్వరూపంతోపాటు ఆయా వార్డుల్లోకి చేరిన ఓటర్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులే ఎక్కువ కావడం 
గమనార్హం. విలీన గ్రామాలను, ఇప్పటికే నగరపాలక సంస్థలో ఉన్న బస్తీలను కలుపుతూ ఏర్పాటు చేసిన వార్డుల విషయంలో కూడా భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సదాశివపల్లి, అల్గునూరు, వావిలాలపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన వార్డులపై అభ్యంతరాలు అధికంగా నమోదయ్యాయి. 

రామగుండంలో 64 అభ్యంతరాలు
రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు గాను 64 అభ్యంతరాలు వచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు. ఇందులో సోమవారం ముగింపు రోజునే 51 అభ్యంతరాలు రావడం గమనార్హం. గతంలో ఒక వార్డులో ఉన్న ఓట్లను ఈసారి మరో వార్డులోకి మార్చడంపైనే అధికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 30వ వార్డును పునర్విభజించి 32, 33, 34, 44 వార్డులుగా మార్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎన్టీపీసీ టీటీఎస్, టీటీఎస్‌లోని 47, 48 డివిజన్లను పునర్విభజనలో భాగంగా ఒకే వార్డుగా మార్చారని, అయితే రెండు వార్డులకు సరిపడా ఓటర్లు ఉన్నారని, పీటీఎస్, టీటీఎస్‌ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఖాజిపల్లి, మాతంగికాలనీలను కలిపి రెండు వార్డులుగా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. అలాగే 27వ వార్డును పునర్విభజనలో 38వ డివిజన్‌గా మార్చి 151 ఓట్లు 37వ డివిజన్‌లో కలిపారని, 38వ డివిజన్‌కు చెందిన ఓటర్లను అరకిలోవీుటర్‌ దూరంలో ఉన్న 37వ డివిజన్‌లో కలుపడంపై సంజయ్‌నగర్‌కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి వార్డులో ఓటర్ల కూర్పు, సరిహద్దుల మార్పుపైనే అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి.

జగిత్యాల జిల్లాలోని  ఐదు మున్సిపాలిటీలలో 96  అభ్యంతరాలు 
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా అభ్యంతరాల స్వీకరణ అవకాశం ఇవ్వగా ఈ నెల 4 నుంచి 9వరకు తక్కువ సంఖ్యలోనే సంఖ్యలోనే అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఆయా మున్సిపాలిటిలకు వచ్చాయి. వాటిలోని చిన్నచిన్న మార్పులు, చేర్పులే అధికంగా ఉంటున్నాయి. ఈ నెల 9వరకు అభ్యంతరాల స్వీకరించగా జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 53, కోరుట్లలో 18, మెట్‌పల్లిలో 18, రాయికల్‌లో ఏడు మాత్రమే విజ్ఞప్తులు అందగా ధర్మపురిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా అభ్యర్థనలు రాలేదు. వస్తున్న అరకొర అభ్యంతరాలు, విజ్ఞప్తులు సైతం పరిష్కరించగలిగేవేనని అధికారులు చెబుతున్నారు. రాయికల్‌లో వార్డుల సంఖ్య పెంచాలని అఖిలపక్ష నాయకులు విజ్ఙప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వార్డుల భౌగోళిక, ఓటర్ల విభజన జరుగలేదంటూ,  ఇష్టానుసారంగా ఇంటి నంబర్లు తొలగించడ, చేర్చడం జరిగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

హుజూరాబాద్‌లో 10, జమ్మికుంటలో 34 
వార్డుల విభజనకు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు కావడంతో పలువురు ఆశావాహులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ పురపాలికలో ఆరు రోజుల్లో 10 అభ్యంతరాలు అందాయి, వార్డు 1, 2, 4, 14, 17, 19, 23, 25, 30 వార్డుల్లోని కొన్ని ఓట్ల మార్పు కోసం అభ్యంతరాలు అందగా, 3వ వార్డులో పోలింగ్‌ స్టేషన్‌ మార్పు చేయాలని అభ్యంతరాలు అందాయి. జమ్మికుంట పురపాలికలో 34 అభ్యంతరాలు అందగా, ఇందులో ప్రధానంగా గతంలో ఉన్న వార్డులో ఉన్న ఓట్లను అదే వార్డులో ఉంచేలా చూడాలని అభ్యంతరాలు అందాయి. వార్డుల విభజన ప్రక్రియలో భాగంగా వచ్చిన అభ్యంతరాలను 16వ తేదీ వరకు పరిశీలన చేసి, అవసరమనుకుంటే స్వల్ప మార్పులు, చేర్పులు చేసి 17న తుది వార్డుల జాబితాను ప్రకటించనున్నారు. 

సిరిసిల్లతోపాటు అన్ని మునిసిపాలిటీల్లో అభ్యంతరాలు
సిరిసిల్ల మునిసిపాలిటీల్లో 39 వార్డులు ఉండగా, 42 అభ్యంతరాలు వచ్చాయి. వార్డుల విభజనకు సంబంధించిన అభ్యంతరాలే అధికంగా ఉన్నాయి. ఇవన్నీ చిన్నచిన్న అభ్యంతరాలే కావడంతో కమిషనర్‌ స్థాయిలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో 28 వార్డులకు గాను 27 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

పెద్దపల్లి 11, సుల్తానాబాద్‌లో 4,    మంథనిలో2
పెద్దపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల రూపకల్పన, ఓటర్ల చేర్పులపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 27, 28వ వార్డుల ఖరారు అశాస్త్రీయంగా ఉందని, 25వార్డులో ఓటర్ల పునః పరిశీలన జరిపించాలి్సందిగా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు కోరారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలోని నలుగురు తమ అభ్యంతరాలను తెలియపరుస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 16వరకు అభ్యంతరాలపై విచారణ జరిపి తగువిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. మంథనిలో వార్డుల కూర్పుపై కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే వ్యక్తమయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top