ఆది నుంచి ఎనలేని కీర్తి..!

History Of Suryapet Municipality - Sakshi

1952లో మూడో శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పాటు అయిన సూర్యాపేట

ఇప్పటివరకు ఏడుగురు చైర్మన్లు, 27 మంది కమిషనర్లు

34 వార్డుల నుంచి 48 వార్డులుగా రూపాంతరం

విలీన గ్రామాలతో.. 92 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మున్సిపాలిటీ

సాక్షి, సూర్యాపేట : ఉమ్మడి రాష్ట్రంలోనే నాటి పోరాటాల నుంచి మొదలుకొని మొన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాకా సూర్యాపేటకు ఓ గుర్తింపు ఉంది. అదే గుర్తింపును రాష్ట్ర ఏర్పాటులో కూడా దక్కించుకుంది. 1952లో సూర్యాపేట మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. అప్పుడు వార్డుల సంఖ్య 16 ఉండగా.. 1967– 86 వరకు 20 వార్డులు, 1987 ఎన్నికల్లో 26 వార్డులు, 1995 ఎన్నికల్లో 28 వార్డులు, 2005 ఎన్నికల్లో 34 వార్డులు ఉన్నాయి.

ప్రస్తుతం 48 వార్డులకు చేరింది. రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా.. పన్నుల వసూళ్లు, తడిపొడి చెత్త విధానం, వర్మి కంపోస్టు ఎరువు తయారీతో పాటు మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలో పేట మున్సిపాలిటీ ముందుంటుందనడంలో అతిశయోక్తి లేదు. నాటి నుంచి నేటి వరకు పేట మున్సిపాలిటీ రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు సాధించుకుంటూ ముందుకు సాగుతోంది. 

1952లో మూడో శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పాటు..
1952లో సూర్యాపేట మున్సిపాలిటీ ఏర్పాటుకాగా.. అప్పట్లో పట్టణంలోని పాత తహసీల్దార్‌ కార్యాలయంలోనే మున్సిపల్‌ కార్యాలయాన్ని నిర్వహించారు. 1952 నుంచి 1984 వరకు మూడో శ్రేణి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. 1952 నుంచి 1954 వరకు మున్సిపల్‌ చైర్మన్‌గా డాక్టర్‌ కర్పూరం శ్రీనివాసస్వామి పనిచేశారు. 1958లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా తిరిగి చైర్మన్‌గా కర్పూరం శ్రీనివాసస్వామినే ఎన్నికయ్యారు. 1962లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా డాక్టర్‌ కర్పూరం స్వామి ఎన్నికయ్యారు. 1964లో మున్సిపల్‌ కార్యాలయం కోసం ప్రస్తుత వాణిజ్య భవన్‌ సమీపంలో ఉన్న పాత మున్సిపల్‌ భవనాన్ని ఖరీదు చేశారు. ఈ క్రమంలోనే 1967లో మున్సిపల్‌ చైర్మన్‌గా వెదిరె నరసింహారెడ్డి ఎన్నికయ్యారు.

1973లో చైర్మన్‌గా పనిచేస్తున్న వెదిరె నరసింహారెడ్డి ఆకస్మికంగా మృతిచెందాడు. 1973 నుంచి 1981 వరకు మున్సిపాలిటీలో స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన కొనసాగింది. 1981లో జరిగిన ఎన్నికల్లో గుర్రం విద్యాసాగర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 1987లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో చైర్మన్‌గా రాచర్ల లక్ష్మీకాంతారావు ఎన్నికయ్యారు. కొద్దికాలంలోనే చైర్మన్‌గా ఉన్న లక్ష్మీకాంతారావు అనారోగ్యంతో మృతిచెందడంతో వైస్‌ చైర్మన్‌గా ఉన్న కట్కూరి గన్నారెడ్డి ఏడాదికి పైగా ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా కొనసాగారు. చైర్మన్‌ లక్ష్మీకాంతారావు మృతితో జరిగిన ఉపఎన్నికల్లో మీలా సత్యనారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

1992–95 మధ్య మరోమారు మున్సిపాలిటీలో స్పెషల్‌ అధికారుల పాలన కొనసాగింది. 1995 మార్చిలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో చైర్మన్‌గా జుట్టుకొండ సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఇదే సంవత్సరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ఇద్దరు జనరల్‌ కోఆప్షన్, ఒకరు మైనార్టీ కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం 2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మరోమారు చైర్మన్‌గా జుట్టుకొండ సత్యనారాయణ  ఎన్నికయ్యారు.

2005 మార్చిలో మున్సిపల్‌ కౌన్సిల్‌ పాలన ముగియగానే ఆ తర్వాత ఆరు నెలల పాటు స్పెషల్‌ అధికారుల పాలన సాగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని పాత జాతీయ రహదారి.. పాత బస్టాండ్‌ సమీపంలో మున్సిపల్‌ భవనంలోకి మార్చారు. అనంతరం 2005 సెప్టెంబర్‌లో పరోక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్‌గా మీలా సత్యనారాయణ ఎన్నికయ్యారు.

2010 సెప్టెంబర్‌ 10 నుంచి జూలై 12, 2014 వరకు స్పెషల్‌ అధికారుల పాలన కొనసాగింది. అనంతరం 2014లో పరోక్ష ఎన్నికల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా గండూరి ప్రవళిక ఎన్నికయ్యారు. అనంతరం జూలై 3, 2018 వరకు ఉన్న పాలకవర్గం పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి స్పెషల్‌ అధికారుల పాలన కొనసాగుతూనే ఉంది. మున్సిపాలిటీ 1987, 1995, 2000లో మాత్రమే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. చైర్మన్‌లుగా కొనసాగుతూ వెదిరె నర్సింహారెడ్డి, లక్ష్మీకాంతారావులు కన్నుమూశారు. 

48 వార్డులుగా రూపాంతరం..
2005లో జరిగిన ఎన్నికల్లో 28 వార్డుల నుంచి 34వార్డులుగా ఏర్పడింది. జనవరి 22న జరగనున్న ఎన్నికల నాటికి 48 వార్డులుగా రూపాంతరం చెందింది. 9 విలీన గ్రామాలతో వాటి సంఖ్య 48 వార్డులకు చేరింది. సూర్యాపేట మున్సిపాలిటీ 92 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇంటి అనుమతుల ఫీజులు, ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఎంకరేజ్‌మెంట్, సర్టిఫికెట్‌ జారీ ఫీజులు, అడ్వర్టైజ్‌మెంట్, సర్టిఫికెట్‌ జారీ ఫీజులు, టాక్స్‌ తదితర వాటితో మున్సిపాలిటీ ఆర్థికంగా అభివృద్ధి చెందింది. 

మున్సిపాలిటీగా ఏర్పడి 68 ఏళ్లు..
సూర్యాపేట మున్సిపాలిటీకి 2020 నాటికి 68 ఏళ్లు నిండాయి. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఏడుగురు చైర్మన్‌లుగా, 27 మంది మున్సిపల్‌ కమిషనర్‌లుగా పనిచేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top