మేం చెప్పిందేమిటి.. మీరు చేసిందేమిటి?

High Court impatience on delloite in Agri Gold - Sakshi

అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో డెల్లాయిట్‌ తీరుపై హైకోర్టు అసహనం

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్, అనుబంధ కంపెనీల టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్‌ గ్రూపు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న డెల్లాయిట్‌ తీరుపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో తామిచ్చిన ఆదేశాల అమలుకు అనుగుణంగా వ్యవహరించకపోవడంపై డెల్లాయిట్‌ను నిలదీసింది. ఇలాగైతే ఈ కేసులో ముందుకెళ్లడం కష్టమని వ్యాఖ్యానించింది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి రోజువారీ పద్ధతిలో మంగళగిరి సీఐడీ ఆఫీసులో అగ్రిగోల్డ్‌ ఆస్తుల డాక్యుమెంట్ల పరిశీలన చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయకుండా, ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు జైలుకెళ్లి స్వయంగా అగ్రిగోల్డ్‌ యజమానులతో చర్చించాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

సీఐడీ కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలనకు ఓ బృందాన్ని, జైలులో అగ్రిగోల్డ్‌ యజమానులను కలిసేందుకు మరో బృందాన్ని, అగ్రిగోల్డ్‌ కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను పరిశీలించేందుకు వేరే బృందాన్ని ఏర్పాటు చేయాలని డెల్లాయిట్‌కు తేల్చి చెప్పింది. కేసు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు మినహా మిగిలిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలన నిమిత్తం సదరు బృందానికి అందుబాటులో ఉంచాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. జైలులో అగ్రిగోల్డ్‌ యజమానులను కలిసేందుకు ఇంకో బృందానికి అనుమతినివ్వాలని జైలు అధికారులకు తేల్చి చెప్పింది. ఈ మూడు బృందాలు ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఏకకాలంలో పని మొదలుపెట్టి పూర్తయ్యే వరకు కొనసాగించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

డాక్యుమెంట్లు పరిశీలించమంటే ప్రత్యుత్తరాలు ఏమిటి?
అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ప్రజల నుంచి కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా డెల్లాయిట్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు పరిశీలన నిమిత్తం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని ఓ లేఖ ద్వారా సీఐడీ అధికారులను కోరామన్నారు.

అయితే నిర్ధిష్టంగా ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పాలని సీఐడీ అధికారులు ప్రత్యుత్తరం ఇచ్చారని ఆయన వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ డాక్యుమెంట్ల పరిశీలనకు తాము స్పష్టమైన ఆదేశాలిస్తే, ఇలా ప్రత్యుత్తరాలు జరపడం ఏమిటంటూ డెల్లాయిట్‌ న్యాయవాదిని నిలదీసింది. అంతకు ముందు సీఐడీ అధికారులు వేలం వేయడానికి సిద్ధంగా ఉంచిన ఆస్తులకు సంబంధించిన విలువలను పిటిషనర్‌ ధర్మాసనం ముందుం చారు. ఈ వివరాలను సమర్పించేందుకు అగ్రిగోల్డ్‌ తరఫు న్యాయవాది గడువు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top