అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు..! | High alert in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో హై అలర్ట్‌

Sep 24 2018 2:10 AM | Updated on Sep 24 2018 11:34 AM

High alert in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, మావోయిస్టుల కదలికలపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఇంటెలిజెన్స్, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులతో సమీక్షించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యకలాపాలు, కదలికలపై నుంచి ఆరా తీశారు. గతంలో జరిగిన దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని తాజా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలకు భద్రత కట్టదిట్టం చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. 2012 వరకు రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు అక్కడక్కడా కొనసాగాయి. అయితే పోలీసుశాఖ ఆ తర్వాత నుంచి వ్యూహాత్మక చర్యలు చేపట్టడంతో మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌కే పరిమితమైంది. గోదావరి దాటి రాష్ట్ర సరిహద్దుల్లోకి రాకుండా గ్రేహౌండ్స్, స్పెషల్‌ పార్టీ బలగాలు మావోయిస్టు పార్టీని నియంత్రించడంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ కమిటీ ఇప్పటివరకు పెద్దగా కార్యకలాపాలు సాగించలేదు.

ఎన్నికల వేళ కలవరం...
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నేతలంతా నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంథని, భూపాలపల్లి, అటవీ ప్రాంతంగా ఉన్న ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భద్రాద్రి నేతలను పోలీస్‌శాఖ çఅప్రమత్తం చేసింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సంబంధిత డీఎస్పీ లేదా ఎస్పీ అధికారికి సమాచారం ఇవ్వాలని, పోలీసు భద్రతతోనే వారు పర్యటనలు సాగించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించింది. నేతల హెచ్చరికలు పట్టించుకోని సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని పోలీస్‌శాఖ అత్యవసర సర్క్యులర్‌లో ఆదేశించింది. మంథని, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తున్న సమాచారం నేపథ్యంలో అక్కడ అదనపు బలగాలను రంగంలోకి దించాలని, కూంబింగ్‌ పెంచాలని ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్న సీఆర్పీఎఫ్‌ బేస్‌ క్యాంపులతో సమన్వయం చేసుకుంటూ మావోయిస్టుల కదిలకలను నియంత్రించాలని సూచించినట్లు తెలుస్తోంది.

శబరితోనే భయం...
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి అనుబంధంగా పనిచేస్తున్న శబరి కమిటీతో అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులను టార్గెట్‌ చేసి దాడులు చేయడం, సెల్‌ఫోన్‌ టవర్లు పేల్చేయడం వంటి ఘటనలకు అప్పుడప్పుడు ఈ కమిటీ పాల్పడుతోంది. ఈ కమిటీ నేతృత్వంలో నడుస్తున్న మణుగూరు కమిటీ ఏకంగా ల్యాండ్‌మైన్లను పెట్టడం, టిఫిన్‌ బాక్స్‌ బాంబులను తయారు చేసి అమర్చడంలో దిట్టగా పేరుగాంచింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక ప్రాంతాల్లో కార్యకలాపాలు విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. పశ్చిమ, తూర్పు గోదావరి, ఖమ్మం ప్రాంతాలను శబరి కమిటీ పర్యవేక్షిస్తోంది. దీంతో కూంబింగ్‌ కోసం గ్రేహౌండ్స్‌ పార్టీలను ఆదివారం మ«ధ్యాహ్నమే రంగంలోకి దించినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement