పట్నమొచ్చి పరేషాన్‌! | Help Line Numbers For Escaped Childrens In Hyderabad | Sakshi
Sakshi News home page

పట్నమొచ్చి పరేషాన్‌!

Jul 25 2018 12:09 PM | Updated on Sep 4 2018 5:53 PM

Help Line Numbers For Escaped Childrens In Hyderabad - Sakshi

సహాయ బృందానికి చిక్కిన బాలలు (ఫైల్‌)

కృష్ణా జిల్లా ఏలూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని శిరీష (పేరు మార్చాం) ఇంట్లోంచి కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికెళ్లాలో అర్థం కాలేదు. బాలిక బిత్తర చూపులను కనిపెట్టిన కొందరు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. ఆ రాత్రంతా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారు జామున తిరిగి రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లారు. ఓ మూలన  కూర్చున్న ఆ చిన్నారిని గమనించిన అధికారులు నిందితులను గుర్తించారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు పంపించారు. ఇది ఒక్క శిరీష ఉదంతం మాత్రమే కాదు. ఇంటి నుంచి పారిపోయి వస్తున్న ఎంతోమంది చిన్నారుల వ్యధ. పేదరికం, పని ఒత్తిడి, కుటుంబంలో నిరాదరణ, పెద్దల నిర్లక్ష్యం వంటి అనేక కారణాలతో ఇల్లు వదిలి వస్తున్న పిల్లలు వీధి పాలవుతున్నారు. ఇలా నగరానికి వస్తున్న చిన్నారులు ఏటా వేల సంఖ్యలోనే ఉంటున్నారు. గత రెండేళ్లలో నగరంలోని సహాయ కేంద్రాల ద్వారా  పునరావాసం పొందిన చిన్నారులు 3000 మందికి పైగా ఉన్నారు. సహాయ కేంద్రాలు, పోలీసులు, రైల్వే అధికారుల దృష్టిలో పడకుండా కార్ఖానాల్లో  బాలకార్మికులుగా బందీ అవుతున్న వాళ్లు, దళారుల బారిన పడి అక్రమ రవాణాకు గురవుతున్న వాళ్లు, వీధుల్లోనే సంచరిస్తూ అనేక రకాల దురలవాట్లకు గురవుతున్నారు. పలువురి బాలల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. 

సాక్షి, సిటీబ్యూరో : స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వస్తున్న చిన్నారులు నగరంలోని అనేక చోట్ల చిన్నచిన్న పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. ‘పిల్లలు ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారంటే పేదరికమే కారణమని భావించలేం. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, పిల్లల పట్ల  తీవ్రమైన నిర్లక్ష్యం కూడా ఇందుకు దోహదపడుతోంది. ఇలాంటి ఎంతోమంది పిల్లలు  అనేక ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్నారు. వీరి సంరక్షణ, చక్కటి భవితవ్యాన్ని అందివ్వడాన్ని సమాజం మొత్తం బాధ్యతగా భావించాలి’ అంటున్నారు దివ్య దిశ వ్యవస్థాపకులు ఫిలిప్స్‌. నాలుగు దశాబ్దాలుగా పిల్లల కోసం పని చేస్తున్న ఆ సంస్థ ఆధ్వర్యంలోనే  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 2015లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు పని చేస్తుంది. దారితప్పి వచ్చే పిల్లలను చేరిదీసి పునరావాసం కల్పిస్తోంది. తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తోంది.  

రైళ్లనే ఎంచుకొంటున్నారు..   
తల్లిదండ్రులు కొట్టారని పారిపోయి వచ్చేవాళ్లు కొందరైతే, హైదరాబాద్‌ చూసేందుకు వచ్చేవాళ్లు మరికొందరు. తప్పిపోయి వచ్చేవాళ్లు ఇంకొందరు. ‘బస్సయితే అందరికీ తెలిసిపోతుంది. పైగా టిక్కెట్‌కు డబ్బులు కావాలి. ట్రైన్‌లో ఆ ఇబ్బంది ఉండదు. ఒక బోగీలోంచి మరో బోగీలోకి మారిపోవచ్చు. ఆఖరికి సీట్ల కింది దాక్కొని రావచ్చు.. 6 నెలల క్రితం అలా హైదరాబాద్‌కు వచ్చిన ఓ పదేళ్ల బాలుడు చెప్పిన మనసులోని మాట ఇది. ఇలా వస్తున్న వారిపై పోలీసులు, రైల్వే అధికారులు, సహాయ కేంద్రాల దృష్టికి చేరితే ఇబ్బంది ఉండదు. సురక్షితంగా తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. కానీ మోసగాళ్ల బారినపడ్డవాళ్లు మాత్రం అక్రమ రవాణాకు గురవుతున్నారు. ‘ఇందుకోసం దళారీ వ్యవస్థ  ఒక పటిష్టమైన నెట్‌వర్క్‌తో పని చేస్తోంది. దళారులకు పట్టుబడిన పిల్లలను  మొదటి వారం పాటు సినిమాలు, షికార్లకు తిప్పుతారు. బాగా డబ్బులు ఇస్తారు. బిర్యాని తినిపిస్తారు. ఆ తర్వాత క్రమంగా కార్మికులుగా, సెక్స్‌వర్కర్లుగా మారుస్తుంటార’ని చెబుతున్నారు సహాయ కేంద్రం నిర్వాహకుడు విజయ్‌. 

సహాయ కేంద్రం 1098కు ఫోన్‌ చేయండి..  
ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో 2 సహాయ కేంద్రాలు పని చేస్తున్నాయి. త్వరలో నాంపల్లి స్టేషన్‌లోనూ ప్రారంభించనున్నారు. స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలతో పాటు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు, రైల్వే అధికారులు, రైల్వేస్టేషన్‌లలోని స్టాల్స్, దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు పిల్లల రక్షణలో భాగస్వాములవుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించే పిల్లల సమాచారాన్ని 1098కు ఫోన్‌ చేసి చెబితే సహాయ కేంద్రాల నిర్వాహకులు వచ్చి తీసుకెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement