breaking news
children escape
-
పట్నమొచ్చి పరేషాన్!
కృష్ణా జిల్లా ఏలూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని శిరీష (పేరు మార్చాం) ఇంట్లోంచి కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికెళ్లాలో అర్థం కాలేదు. బాలిక బిత్తర చూపులను కనిపెట్టిన కొందరు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. ఆ రాత్రంతా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారు జామున తిరిగి రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లారు. ఓ మూలన కూర్చున్న ఆ చిన్నారిని గమనించిన అధికారులు నిందితులను గుర్తించారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు పంపించారు. ఇది ఒక్క శిరీష ఉదంతం మాత్రమే కాదు. ఇంటి నుంచి పారిపోయి వస్తున్న ఎంతోమంది చిన్నారుల వ్యధ. పేదరికం, పని ఒత్తిడి, కుటుంబంలో నిరాదరణ, పెద్దల నిర్లక్ష్యం వంటి అనేక కారణాలతో ఇల్లు వదిలి వస్తున్న పిల్లలు వీధి పాలవుతున్నారు. ఇలా నగరానికి వస్తున్న చిన్నారులు ఏటా వేల సంఖ్యలోనే ఉంటున్నారు. గత రెండేళ్లలో నగరంలోని సహాయ కేంద్రాల ద్వారా పునరావాసం పొందిన చిన్నారులు 3000 మందికి పైగా ఉన్నారు. సహాయ కేంద్రాలు, పోలీసులు, రైల్వే అధికారుల దృష్టిలో పడకుండా కార్ఖానాల్లో బాలకార్మికులుగా బందీ అవుతున్న వాళ్లు, దళారుల బారిన పడి అక్రమ రవాణాకు గురవుతున్న వాళ్లు, వీధుల్లోనే సంచరిస్తూ అనేక రకాల దురలవాట్లకు గురవుతున్నారు. పలువురి బాలల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి, సిటీబ్యూరో : స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వస్తున్న చిన్నారులు నగరంలోని అనేక చోట్ల చిన్నచిన్న పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. ‘పిల్లలు ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారంటే పేదరికమే కారణమని భావించలేం. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, పిల్లల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం కూడా ఇందుకు దోహదపడుతోంది. ఇలాంటి ఎంతోమంది పిల్లలు అనేక ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్నారు. వీరి సంరక్షణ, చక్కటి భవితవ్యాన్ని అందివ్వడాన్ని సమాజం మొత్తం బాధ్యతగా భావించాలి’ అంటున్నారు దివ్య దిశ వ్యవస్థాపకులు ఫిలిప్స్. నాలుగు దశాబ్దాలుగా పిల్లల కోసం పని చేస్తున్న ఆ సంస్థ ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 2015లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు పని చేస్తుంది. దారితప్పి వచ్చే పిల్లలను చేరిదీసి పునరావాసం కల్పిస్తోంది. తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తోంది. రైళ్లనే ఎంచుకొంటున్నారు.. తల్లిదండ్రులు కొట్టారని పారిపోయి వచ్చేవాళ్లు కొందరైతే, హైదరాబాద్ చూసేందుకు వచ్చేవాళ్లు మరికొందరు. తప్పిపోయి వచ్చేవాళ్లు ఇంకొందరు. ‘బస్సయితే అందరికీ తెలిసిపోతుంది. పైగా టిక్కెట్‌కు డబ్బులు కావాలి. ట్రైన్లో ఆ ఇబ్బంది ఉండదు. ఒక బోగీలోంచి మరో బోగీలోకి మారిపోవచ్చు. ఆఖరికి సీట్ల కింది దాక్కొని రావచ్చు.. 6 నెలల క్రితం అలా హైదరాబాద్‌కు వచ్చిన ఓ పదేళ్ల బాలుడు చెప్పిన మనసులోని మాట ఇది. ఇలా వస్తున్న వారిపై పోలీసులు, రైల్వే అధికారులు, సహాయ కేంద్రాల దృష్టికి చేరితే ఇబ్బంది ఉండదు. సురక్షితంగా తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. కానీ మోసగాళ్ల బారినపడ్డవాళ్లు మాత్రం అక్రమ రవాణాకు గురవుతున్నారు. ‘ఇందుకోసం దళారీ వ్యవస్థ ఒక పటిష్టమైన నెట్‌వర్క్‌తో పని చేస్తోంది. దళారులకు పట్టుబడిన పిల్లలను మొదటి వారం పాటు సినిమాలు, షికార్లకు తిప్పుతారు. బాగా డబ్బులు ఇస్తారు. బిర్యాని తినిపిస్తారు. ఆ తర్వాత క్రమంగా కార్మికులుగా, సెక్స్‌వర్కర్లుగా మారుస్తుంటార’ని చెబుతున్నారు సహాయ కేంద్రం నిర్వాహకుడు విజయ్. సహాయ కేంద్రం 1098కు ఫోన్ చేయండి.. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో 2 సహాయ కేంద్రాలు పని చేస్తున్నాయి. త్వరలో నాంపల్లి స్టేషన్లోనూ ప్రారంభించనున్నారు. స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు, రైల్వే అధికారులు, రైల్వేస్టేషన్లలోని స్టాల్స్, దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు పిల్లల రక్షణలో భాగస్వాములవుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించే పిల్లల సమాచారాన్ని 1098కు ఫోన్ చేసి చెబితే సహాయ కేంద్రాల నిర్వాహకులు వచ్చి తీసుకెళ్తారు. -
ఈ బాలలు చేసిన పాపం ఏమిటి?
గ్వేయర్: 12 ఏళ్ల నజీర్ అదృష్టవంతుడు. బాంబుల జాకెట్ ధరించి అమాయక ప్రజల మధ్య ఆత్మాహుతి బాంబుగా పేలాల్సిన నజీర్ ఐసిస్ ఉగ్రవాదుల కబంధ హస్తాల నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. కుర్దిస్థాన్‌లోని ఎస్యాన్ శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకున్నాడు. పైశాచిక ఉగ్రవాదుల వద్ద బాల సైనికుడిగా శిక్షణ పొందుతూ అనుభవించిన క్షోభను, మౌనంగా ఏడ్చిన రాత్రుల గురించి పూసగుచ్చినట్టు మీడియాకు వివరించాడు. దయచేసి తన అసలు పేరునుగానీ, తల్లిదండ్రుల పేర్లనుగానీ వెల్లడించవద్దని, ఫొటో లేదా రికార్డు చేసిన తన గొంతునుగానీ విడుదల చేయరాదని మీడియాను వేడుకున్నాడు. ఆ వేడుకోలులో ఆందోళన, ఆవేదన ఉంది. మనకు తెలియని చీకటి కోణాలూ ఉన్నాయి. ఆ బాలుడితోపాటు మరో 15000 మంది యాజిదీలు ఐసిస్ కేంద్రాల నుంచి తప్పించుకున్నారు. ‘ఐసిస్ ఉగ్రవాదుల వద్ద సైనిక శిక్షణ పొందుతున్న 60 మంది బాలల్లో నేను ఒకడిని. బాంబులు కురిపిస్తూ పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలు వచ్చినప్పుడు మమ్మల్ని నేల మాళిగల్లోకి తీసుకెళ్లి దాచేవారు. అవి అల్లాను విశ్వసించని అమెరికాకు చెందిన విమానాలని, చంపడానికి వచ్చాయని చెప్పేవారు. వారి నుంచి రక్షించేందుకే తామున్నామని చెప్పేవారు. మా తల్లిదండ్రులకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటామని నమ్మబలికేవారు. శిక్షణ ఇస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు అల్లాను విశ్వసించనివారని, శిక్షణ పూర్తికాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను హతమార్చాలని బోధించేవారు. ఉగ్రవాదులే మా కుటుంబమని చెప్పేవారు. మాలో అత్యంత పిన్న వయస్కుడు ఐదేళ్ల బాలుడు. మమ్మల్ని కాలిఫేట్ పిల్లలని పిలిచేవారు. తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడు మాకు ఏడుపొచ్చేది. కానీ ఏడ్వనిచ్చేవారు కాదు. తల్లిదండ్రులు నా గురించి ఎంత ఆందోళన పడుతున్నారోనని తల్లడిల్లేవాడిని. ఎవరూ లేనిది చూసి ఒంటరిగా నాలోనేనే ఏడ్చేవాడిని. ఇప్పుడు వారి నుంచి తప్పించుకొని తల్లి ఒడిని చేరుకోవడం నాకు నిజంగా పునర్జన్మే’ అని నజీర్ వ్యాఖ్యానించాడు. సిరియాలోని రక్కాలో సైనిక దుస్తుల్లో ముఖానికి ముసుగులు ధరించిన బాలలకు శిక్షణ ఇస్తున్నట్టు ఐసిస్ విడుదల చేసిన ప్రచార వీడియోలోనూ నజీర్ ఉన్నాడు. ‘తో జిహాద్, తో జిహాద్’ అని బాలలు నినాదం చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అల్లాను నమ్మని మనుషులకు వ్యతిరేకంగా జరిగే జిహాది యుద్ధంలో ఈ పిల్లలే అగ్రభాగాన నిలుస్తారంటూ ఐసిస్ శిక్షకుడు చేసిన కామెంట్ కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తప్పించుకొని తమ వద్దకు వచ్చినప్పుడు పిల్లలంతా కంకాళాల్లాగా కనిపించారని, నరకం నుంచి వచ్చామని వారు చెప్పడం కదిలించిందని వారిని రక్షించడానికి సహాయపడిన ప్రభుత్వ సైనిక కమాండర్ అజీజ్ అబ్దుల్లా హదూర్ మీడియాకు తెలిపారు. తమ సైనికుల కాల్పుల్లో కూడా కొన్ని సార్లు పిల్లలు బలయ్యేవారని, ఎందుకంటే, పిల్లలను రక్షణ కవచంలా ముందుపెట్టుకొని ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపేవారని అజీత్ తెలిపారు. ‘ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనసు గిలగిలా కొట్టుకునేది. మేము వారిని చంపకపోతే వారు మమ్మల్ని చంపుతారు.ఉగ్రవాదులను చంపడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. పిల్లలకు ఆత్మాహుతి జాకెట్లను తొడిగి ముందుకు పంపించిన సందర్భాలు కూడా తమకు ఎదురైనట్లు ఆయన వివరించారు. బాల సైనికుల శిక్షణలో పాల్గొనకపోతే పిల్లలను ఉగ్రవాదులు చితకబాదేవారట. చేరనన్నందుకు తన కాలును మూడు ముక్కలు చేశారని ఐసిస్ నుంచి తప్పించుకొచ్చిన 11 ఏళ్ల నౌరి తెలిపాడు. కాలు ఎముకలు అతుకున్నప్పటికీ తాను నడవలేక పోయానని, దాంతో ‘యూజ్లెస్ ఫెల్లో’ అని తిట్టి తన ను ఇంటికి తీసుకెళ్లి పోవాల్సిందిగా తన నానమ్మను ఆదేశించారని, అలా వారి నుంచి బయటపడ్డానని నౌరి చెప్పాడు. ఇలా ఏదో రకంగా ఐసిస్ చెర నుంచి బయట పడిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ.