ఉపాధి వేటలో ఆగిన గుండె

Heart Attack Man Died In Karimnagar - Sakshi

బోయినపల్లి(కరీంనగర్‌): ఉపాధి వేటలో మరో గుండి ఆగిపోయింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ బడుగుజీవి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే ఆలోచనతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లాడు. అక్కడ జీతం సరిగ్గా రాకపోవడంతో తిరిగొచ్చి రెండు నెలల క్రితం కువైట్‌ వెళ్లాడు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు వదిలాడు. శవపేటిక స్వగ్రామం చేరడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బోయినపల్లి మండలంలోని మధ్యమానేరు ముంపు గ్రామం కొదురుపాకకు చెందిన నిర్వాసితుడు ఒజ్జెల శ్రీనివాస్‌(36) గుండెపోటుతో ఈనెల 16న కువైట్‌లో మృతిచెందాడు.

శ్రీనివాస్‌ మృతదేహం మంగళవారం స్వగ్రామం చేరుకుంది. మృతదేహాన్ని చూడడంతోనే శ్రీనివాస్‌ భార్య రేణుక, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు కూతళ్లు భార్గవి, సిరివెన్నెల తండ్రి మృతదేహం వద్ద విలపించిన తీరు కంటతడి పెట్టించింది. గతంలో శ్రీనివాస్‌ ఇక్కడ ఆటో నడుపుతూ జీవనోపాధి పొందేవాడు. పరిస్థితులు సరిగ్గా లేక దుబయి, సౌదీ దేశాలకు వెళ్లాడు. అక్కడ సరైన జీతాలివ్వకపోవడంతో మళ్లీ తిరిగొచ్చి..రెండు నెలల క్రితం కువైట్‌ వెళ్లాడు. ఈనెల 16న పనులు ముగించుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. భోజనం చేస్తున్న సమయంలో శ్రీనివాస్‌ గుండెపోటుతో కుప్పకూలాడు.
  
చితికి నిప్పుపెట్టిన కూతురు 
శ్రీనివాస్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు భార్గవి చితికి నిప్పంటించింది. కళ్ల నుంచి నీళ్లు కారుతుండగా చిన్నారి తండ్రి అంతిమయాత్రలో పాల్గొన్న తీరు గ్రామస్తులను కలచివేసింది.

గ్రామస్తుల ఆర్థికసాయం 
శ్రీనివాస్‌ కుటుంబ పరిస్థితులను గమనించిన ముంపు గ్రామాల ఐఖ్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్‌ ఆధ్వర్యంలో పలువురు ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చారు. దాదాపు రూ.33 వేల ఆర్థికసాయం అందించారు. కూస రవీందర్‌ రూ.10 వేలు, శెట్టి అనిల్‌కుమార్‌ రూ.5వేలు, కుడుదుల శివకుమార్‌ రూ.5వేలు, చీర్లవంచ మాన్వాడ అనిల్‌ రూ.4వేలు, తాళ్లపల్లి తిరుపతి, పొత్తూరు అనిల్‌కుమార్, డెయిరీ ఎర్ర అనిల్‌ మరికొందరు కలిసి రూ.33 వేల వరకు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులకు అందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top