ఆదాయం రూ.58 కోట్లు.. అద్దె రూ.80 కోట్లు

Greater Hyderabad TS RTC Loss With Rental Busses - Sakshi

ఆర్టీసీకి గుదిబండగా అద్దె బస్సులు

నగరంలో నడుస్తున్నవి 400  

ఏటా వీటి అద్దె రూ.80 కోట్లు

ఆదాయం మాత్రం రూ.58 కోట్లు

ఈ లెక్కన నష్టం రూ.22 కోట్లు  

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ ఆర్టీసీపై అద్దె బస్సులు పిడుగుపాటుగా మారాయి. వాటిపై వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దే అధికంగా ఉంటోంది. కొత్త బస్సులు కొనలేని స్థితిలో సంస్థ ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్న సుమారు 400 బస్సులపై గ్రేటర్‌ ఆర్టీసీ ఏటా రూ.కోట్ల అద్దె చెల్లిస్తోంది. నిజానికి ఆర్టీసీ అద్దె రూపంలో చెల్లించే సొమ్ముతో సొంతంగా బస్సులను సమకూర్చుకోవచ్చు. కానీ డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు, వారికి చెల్లించే జీతభత్యాలను భారంగా భావిస్తున్న అధికారులు ‘అద్దె రూట్‌’లో ప్రయాణిస్తున్నారు. మరోవైపు ఈ అద్దె బస్సుల్లోనూ ఎక్కువ శాతం ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన ఒకరిద్దరు నాయకులతో పాటు కొందరు రిటైర్డ్‌ అధికారులు కూడా తమ బంధువుల పేరిట ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇస్తున్నట్లు సమాచారం. ఏటా సుమారురూ.80 కోట్ల వరకు ఈ బస్సులకు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు.

కానీ ఈ బస్సుల నిర్వహణ ద్వారా ఆర్టీసీకి వచ్చే ఆదాయం మాత్రం కేవలం రూ.58 కోట్లు. అంటే అద్దె బస్సులపై రూ.22 కోట్ల వరకు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఇంధనం వినియోగంలోనూ, విడిభాగాలు, ఇతర ఖర్చుల్లోనూ పొదుపు మంత్రం పాటించే ఆర్టీసీ అద్దె బస్సులపై కోట్లాది రూపాయాలు అదనంగా చెల్లించడంపై కొన్ని కార్మిక సంఘాలు మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సొంత బస్సుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని, ఆర్టీసీని బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అదనంగా చెల్లించే రూ.22 కోట్లతో కనీసం 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకొనే అవకాశం ఉందని ఆయా సంఘాలు వాదిస్తున్నాయి. కేవలం ప్రైవేట్‌ ఆపరేట్ల స్వలాభం కోసమే ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బస్సుల నిర్వహణ, ఇంధనం ఖర్చులు, గిట్టుబాటుకాని ఏసీ బస్సులు, విడిభాగాల కొనుగోలు, అద్దె బస్సులకు చెల్లించిన సొమ్ము అంతా కలిపి గ్రేటర్‌ ఆర్టీసీ నష్టాలు సుమారు రూ.450 కోట్లకు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.701 కోట్ల నష్టాలు నమోదు కాగా, ఒక్క గ్రేటర్‌లోనే అందులో సగానికంటే అధికంగా నష్టాలు రావడం గమనార్హం.

అద్దె బస్సులకు పొదుపు మంత్రం వర్తించదా?
మహానగరంలో ప్రతిరోజు 3,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1050 రూట్లలో ప్రతిరోజు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడం, సుమారు 1,000 బస్సులు కాలం చెల్లిపోవడం వంటి కారణాల దృష్ట్యా 400 బస్సులను అద్దెకు తీసుకున్నారు. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతూ, రద్దీ తక్కువగా ఉండే  మార్గాల్లో అద్దె బస్సులకు అనుమతులిచ్చారు. ఈ బస్సులు రోజుకు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. అద్దె బస్సులు తిరిగే రూట్లు, బస్సుల కండిషన్‌ (మెట్రో ఎక్స్‌ప్రెస్‌/ఆర్డినరీ) దృష్ట్యా  ఒక కిలోమీటర్‌కు రూ.22 చొప్పున ఆర్టీసీ చెల్లిస్తోంది. కానీ ఈ బస్సుల నిర్వహణ ద్వారా కిలోమీటర్‌కు ఆర్టీసీకి వచ్చే ఆదాయం  పట్టుమని రూ.10 కూడా ఉండడం లేదు. మొత్తంగా ఆర్టీసీకి వచ్చే ఆదాయం కంటే అదనపు సొమ్మును ప్రైవేట్‌ ఆపరేటర్లకు కట్టబెట్టాల్సి వస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top