రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ ఈ నెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ ఈ నెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందడంతో గవర్నర్ పర్యటన కోసం ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు పడ్డారు. గవర్నర్ నరసింహన్ సోమవారం ఉదయం 10 గంటలకు షాద్‌నగర్ మండలం కిషన్‌నగర్, హజ్‌పల్లి గ్రామ పంచాయతీలోని ఒక గ్రామంలో జరిగే గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. గవర్నర్ నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా అధికారులు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
అయితే ఇతమిత్తంగా ఏ గ్రామంలో పర్యటిస్తారన్న విషయం అధికారికంగా ఖరారు కాకున్నా హజ్‌పల్లి, కిషన్‌నగర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి అధికారులను, మండలస్థాయి అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఈ రెండు గ్రామాల్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి పనులు జరగడంతో పాటు ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. జిల్లాస్థాయిలో గ్రామాలు సాధించిన అభివృద్ధిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గవర్నర్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.
గ్రామజ్యోతిలో పాల్గొనే గ్రామంలోని ప్రజలతో కలిసి గవర్నర్ సహపంక్తి భోజనం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు, జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.