రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన జరిపారు. రెండు రోజుల జిల్లా పర్యటన
రాజమండ్రి :రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన జరిపారు. రెండు రోజుల జిల్లా పర్యటన కోసం ఆయన హైదరాబాద్ నుంచి మధురపూడి విమానాశ్రయానికి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి దేశంలోనే అతి పెద్దదిగా నిర్మిస్తున్న కోటిలింగాలఘాట్‌ను పరిశీలించారు. దాని గురించి ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎస్.సుగుణాకరరావులు గవర్నర్‌కు వివరించారు. ఘాట్‌ను రెండు దశల్లో 1,128 మీటర్ల మేర నిర్మిస్తున్నామని ఎస్‌ఈ వివరించారు.
ఘాట్‌కు వచ్చే దారులు, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఘాట్‌మీదకు భక్తుల వాహనాలకు అనుమతి లేదని, పరిశుభ్రత, అంబులెన్స్, పోలీసు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇందుకు రోడ్డును డివైడ్ చేస్తామని ఎమ్మెల్యే ఆకుల వివరించారు. ప్రతి 200 మీటర్లకు ఒక ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేసి, వచ్చేందుకు ఒక మార్గం, స్నానాలు చేసిన తరువాత వెళ్లేందుకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని గవర్నర్ సూచించారు.
ఘాట్ రహదారి సౌకర్యాలకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. పుష్కరాలు ఆరంభమయ్యేనాటికి వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఈ మాట్లాడుతూ జూలై మొదటివారంలో పది లక్షల క్యూసెక్కులు, నెలాఖరుకు 20 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఆ సమయంలో భక్తులకు ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్కడినుంచి గవర్నర్ పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ఘాట్ చివరి మెట్టు వరకూ వెళ్లి పరిశీలించారు.
అనంతరం గవర్నర్ నేరుగా కోరుకొండ మండలం కాపవరం చేరుకుని రాజు చెరువు వద్ద జరుగుతున్న నీరు-చెట్టు పనులను పరిశీలించారు. ఆయనకు రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడ పది నిమిషాలు గడిపిన గవర్నర్ నీరు-చెట్టు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించారు. అక్కడనుంచి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, ప్రధానార్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సతీ సమేతంగా స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శనను గవర్నర్ దంపతులు తిలకించారు. అక్కడ నుంచి కాకినాడ చేరుకుని రాత్రి బస చేశారు.