
రెండు దశాబ్దాల కల నెరవేర్చిన కేసీఆర్
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలనే రెండు దశాబ్దాల గిరిజనుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్ అన్నారు.
కరీంనగర్ సిటీ : తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలనే రెండు దశాబ్దాల గిరిజనుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా మార్చాలని 1994లో నాగార్జునసాగర్‌లో జరిగిన సభలో తొలిసారి డిమాండ్ చేశామని గుర్తుచేశారు.
అప్పటి నుంచి ఎన్నో ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేసినా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. 20 ఏళ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సీఎం కేసీఆర్ ఆ డిమాండ్‌ను అంగీకరిస్తూ ఉత్తర్వు జారీ చేశారని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో కేసీఆర్‌కు లక్షమందితో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమన్యాయం చేసిన ఏకై క ప్రభుత్వం కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నందునే ఆ శాఖలను కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారని చెప్పారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తామని చెప్పిన మొదటి పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు. కర్నాటక తరహాలో తండా డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ల ఏర్పాటు డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని, సేవాలాల్‌భవన్, కొమురంభీం భవన్‌లు నిర్మించాలనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
బంజరా సంప్రదాయాలను, నృత్యాలను వాడుకుని సినీపరిశ్రమ సొమ్ము చేసుకుంటుందన్నారు. తమ తండాల్లో ఉన్న మహిళలకు జయప్రద, జయసుధలు కూడా పనికిరారన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బంజరా భవన్ ఏర్పాటుకు ఎకరం భూమి ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని వెల్లడించారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బంజారాభేరి జిల్లా కన్వీనర్ భూక్యా తిరుపతినాయక్, కార్పొరేటర్ ఎల్.రూప్‌సింగ్, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గుంజపడుగు హరిప్రసాద్, రాజునాయక్, కిషన్‌నాయక్ పాల్గొన్నారు.