సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో మంటలు

Fire accident in Siddipet district hospital - Sakshi

ఆక్సిజన్‌ సిలిండర్‌ లీకై మంటలు.. తప్పిన ముప్పు

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ లీకై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో  ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌ విభాగంలో గర్భిణులు, పిల్లల ఓపీ సేవల విభాగం పక్కనే ఉన్న ఒక స్టోర్‌ రూంలో శనివారం ఉదయం ఆక్సిజన్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగాయి.  దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో రోగులు ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన గదిలో సిబ్బంది వస్తువులు, ఆస్పత్రి సామగ్రి కాలి బూడిదైంది.

అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దట్టమైన పొగ కారణంగా ఔట్‌ పేషెంట్‌ విభాగంలో సేవలు నిలిచిపోయాయి. సిబ్బంది ఆస్పత్రి పైఅంతస్థుల్లో ఉన్న బాలింతలు, వారి పిల్లలను ఆస్పత్రి వెనుక భాగం నుంచి బయటకు పంపించారు. పెను ప్రమాదం తప్పిందని వైద్య సిబ్బంది తెలిపారు. బాలింతలు నొప్పులతో బయటకు వెళ్లడానికి అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆస్పత్రి డైరెక్టర్‌ తమిళ్‌ అరసి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రయ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు అంబులెన్స్‌లు, ఇతర వాహనాల్లో రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top