తుది దశకు ఎస్టీపీపీ పనులు


సీఓడీకి సన్నాహాలు చేస్తున్న అధికారులు

బీఓపీ, బీటీజీ పనులకు డెడ్‌లైన్ విధించిన సీఎండీ

చివరి పనులను ముమ్మరం చేసిన అధికారులు

ఈనెలాఖరులో రెండో యూనిట్ సింక్రనైజేషన్

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితం


 


జైపూర్ (ఆదిలాబాద్) : జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చిలో మొదటి యూనిట్ ప్లాంట్‌ను సింక్రనైజేషన్ (ఉత్పత్తి ప్రారంభం) చేసిన అధికారులు.. తాజాగా రెండో యూనిట్ ప్లాంట్‌ను ఈనెల చివరిలోగా సింక్రనైజేషన్ చేసి కమర్షియ ల్ ఆపరేషన్ (సీఓడీ) విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా, ఇటీవల పవర్‌ప్లాంట్ పనులను పరిశీలించిన సింగరేణి సీఎండీ శ్రీధర్ యూనిట్-1, యూనిట్-2 బీఓపీ, బీటీజీ నిర్మాణ పనులకుగడువు విధించారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని పనులను ఈనెల 20లోగా అనుసంధానం చేయాలని స్పష్టంగా చెప్పారు.


 

బీటీజీ పనులు పూర్తి..


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జైపూర్ సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణ పనులు చకచకా ముందుకుసాగాయి. ఏడాది కాలంలో ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతి వచ్చింది. కాగా, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను సకాలంలో పరిష్కరించేందుకు సింగరేణి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా 1200 మెగావాట్ల పవర్‌ప్లాంట్ నిర్మాణంలో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంట్‌ను గత మార్చి 13వ తేదీన సింక్రనైజేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. కాగా, ఈనెల 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించి వచ్చేనెల నుంచి పూర్తిస్థాయిలో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, పవర్ ప్లాంట్ నిర్మాణంలో ప్రధానమైన బీటీజీ (బాయిలర్ టర్బైన్ జనరేషన్) నిర్మాణ పనులు ఇప్పటికే వం దశాతం శాతం పూర్తయ్యాయి. కాగా, కీలకమైన బీఓపీ (బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్స్) పనులు బీటీజీ పనుల కన్నా ఏడాదిన్నర కాలం ఆల స్యంగా ప్రారంభంకావడంతో బీఓపీ పనుల్లో కొంత జాప్యం నెలకొంది.





ఈ క్రమంలో బీఓపీ పనుల్లో ఇంకా చాలా పూర్తి కావాల్సి ఉంది. బీటీ జీ పనులు పూర్తి అయినప్పటికీ బీఓపీ పనుల్లో కీలకమైన కూలింగ్ టవర్స్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), సర్క్యూలేటింగ్ వాటర్ (సీడబ్ల్యూ) సిస్టమ్, రిజర్వాయర్-2 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బీటీజీ పనులు పూర్తయినప్పటికీ బీఓపీ పనులు పూర్తికాకపోవడం విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడంలేదు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పుడు బీఓపీ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సింగరేణి డెరైక్టర్ (ఈఅండ్‌ఎం) రమేష్‌బాబు నిత్యం పనులను పర్యవేక్షిస్తూ రోజువారీ వివరాలను సీఎండీ శ్రీధర్‌కు తెలియజేస్తున్నారు.


 


నెలాఖరులోగా  విద్యుత్ ఉత్పత్తి..

జైపూర్ సింగరేణి పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సింగరేణి అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే యూనిట్-1 ప్లాంట్ సింక్రనైజేషన్ చేయగా త్వరలో యూనిట్-2ను సింక్రనైజేషన్ చేసి ఈ నెలాఖరులోగా కనీసం 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని  అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్లాంట్‌ను ప్రారంభించి సింగరేణి విద్యుత్‌ను జాతికి అంకితం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్లాంట్ వద్ద శాశ్వత హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టగా.. థర్మల్ పవర్‌ప్లాంట్ ఆకృతితో మరో శిలాఫలకాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం గా ఈ నెలలో సింగరేణి వెలుగులు తెలంగాణ ప్రజలకు అందనున్నాయి.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top